దౌత్య ప్రయత్నాలపై చీకటి మేఘం... పాక్ మంత్రి బెదిరింపు మాటలు!
నిన్న మొన్నటి వరకూ భారత్ పై అవాకులు చెవాకులు, బెదిరింపు మాటలూ మాట్లాడిన పాకిస్థాన్.. ఇప్పుడు మైకు ఆఫ్గాన్ వైపు తిప్పింది.;
నిన్న మొన్నటి వరకూ భారత్ పై అవాకులు చెవాకులు, బెదిరింపు మాటలూ మాట్లాడిన పాకిస్థాన్.. ఇప్పుడు మైకు ఆఫ్గాన్ వైపు తిప్పింది. ఇస్తాంబుల్ లో ఆఫ్గాన్ - పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా చర్చలు సఫలమవ్వాలని కోరుకోవాల్సిన పాక్ మంత్రి.. ఆఫ్గన్ పై బెదిరింపులకు దిగారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదని చెప్పుకొచ్చారు.
అవును... ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తాలిబాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా చర్చలు విఫలమైతే సైనిక చర్యకు సిద్ధమవుతామని బెదిరించారు. దీంతో ఈ ప్రకటన ఉద్రిక్తతలను నాటకీయంగా పెంచడంతో పాటు దౌత్య ప్రయత్నాలపై చీకటి మేఘాన్ని కమ్మేసిందని అంటున్నారు.
బుధవారం ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. శాంతిచర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి మరింత దిగజారుతుందని.. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి.. మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని.. తమవద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని.. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుందని ఖవాజా అన్నారు.
ఇదే సమయంలో... కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పాక్ మంత్రి ఆరోపించారు. అయితే.. ఖవాజా వ్యాఖ్యలను అఫ్గాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకొని పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంపై మౌనాన్ని ప్రశ్నించింది.
ఇస్తాంబుల్ వేదికగా అఫ్గాన్ - పాకిస్థాన్ మధ్య నేడు మూడోవిడత శాంతి చర్చలు జరగనున్నాయి. దీనికి ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్ లో రెండు విడతల్లో జరిగిన చర్చల్లో ఎలాంటి శాంతి ఒప్పందాలు జరగలేదు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను నిరోధించాలని కాబుల్ ను కోరగా, ఆ మేరకు హామీ లభించలేదని నాడు పాక్ తెలిపింది.
కాగా... అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు, పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే కాబుల్ లోనూ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
ఈ పేలుళ్లకు పాకిస్థాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. అనంతరం అఫ్గాన్ సైన్యం.. పాకిస్థాన్ పై దాడులకు దిగింది. దీంతో పాక్ ఎదురుదాడులు జరిపింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటినుంచి ఇరుదేశాల సరిహద్దుల్లోనూ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా శాంతి చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది వేచి చూడాలి!