పాక్-సౌదీ రక్షణ ఒప్పందం..! సైన్యాన్ని అమ్మేసిందా...? కథ పెద్దదే
ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాలలోని ఏ దేశంపై దాడి చేసినా అది రెండు దేశాలపైన జరిగినట్లుగానే భావిస్తారు.;
ప్రపంచంలో మరీ ముఖ్యంగా పశ్చిమాసియాలో ఓ అంశం చాలా చర్చనీయం అవుతోంది... అదే దక్షిణాసియాలోని పాకిస్థాన్ తో పశ్చిమాసియాలోని సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకోవడం.. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాలలోని ఏ దేశంపై దాడి చేసినా అది రెండు దేశాలపైన జరిగినట్లుగానే భావిస్తారు. పెహల్గాం ఉగ్రదాడి- ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్-సౌదీ రక్షణ ఒప్పందం కీలకంగా మారింది. ఇక ఇందులో మూడో దేశం కూడా చేరే చాన్సుందని అంటున్నారు. అంతేకాదు.. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూదన్న రూల్ కూడా ఏమీ లేదని పాకిస్థాన్ అంటోంది. కానీ, సౌదీతో పాక్ కొత్త పొత్తు వెనుక అసలు విషయం వేరే ఉంది.
ఏకైక అణు సామర్థ్యం..
ముస్లిం దేశాల్లో అణు బాంబులు ఉన్నది పాకిస్థాన్ మాత్రమే. ఇరాన్ కూడా అణ్వాయుధాలు సమకూర్చుకుందని చెబుతారు కానీ.. అందులో కచ్చితత్వం లేదు. అసలు ఇరాన్ అణు సామర్థ్యాన్ని ఇటీవల ఇజ్రాయెల్ దెబ్బకొట్టింది కూడా. ఈ నేపథ్యంలో పాక్ తాజాగా సౌదీతో చేసుకున్న ఒప్పందంపై చర్చ సాగుతోంది. దీనిని నాటో తరహా ఒప్పందం అని పాక్ అంటోంది. నాటో సభ్య దేశాల్లో ఏ ఒక్క దానిపై బయటి దేశం దాడి చేసినా అది నాటో మొత్తం దేశాలపై చేసినట్లుగానే భావించి యుద్ధం చేస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియాతోనూ పాక్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది.
పశ్చిమాసియాలో పెత్తనానికి
విస్తీర్ణం ప్రకారం సౌదీ అరేబియా పశ్చిమాసియాలో పెద్ద దేశం. కానీ, ఈ ప్రాంతంలో ఏకైక అణు ఆయుధాలు ఉన్నది ఇజ్రాయెల్. అందుకే దాని శత్రుదేశాలన్నీ భయపడుతుంటాయి. ఆఖరికి హమాస్ మిలిటెంట్ నేతలు లక్ష్యంగా ఖతర్ పై ఇజ్రాయెల్ దాడి చేసినా ఏమీ అనలేని పరిస్థితి. సౌదీ అరేబియా ఇప్పుడు పాకిస్థాన్ తో చేతులు కలిపినందున దానికీ అణు భద్రత లభించినట్లేనని (పరోక్షంగా అయినా) భావించాలి. దీంతో ఇజ్రాయెల్ తమతో జాగ్రత్తగా ఉంటుందని భావిస్తోందనుకోవచ్చు.
పాక్ సైన్యాన్ని అమ్మేసినట్లే...
పైకి మాత్రం సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకున్నా.. పాకిస్థాన్ అసలు ఉద్దేశం మాత్రం ఆ దేశం నుంచి ఆర్థిక సాయం పొందడం. పరోక్షంగా ఒక్కమాటలో చెప్పాలంటే, సౌదీని రక్షణ పరంగా ఆదుకుంటామనే లెక్క చూపి తమ సైన్యాన్ని ఆ దేశానికి అమ్మేసినట్లు. ఇక పాక్ కు ఎప్పటినుంచో సౌదీ ఉచితంగా కూడా ఆర్థిక సాయం చేస్తోంది. ఇకపై రక్షణ ఒప్పందం సాకు చూపి మరింత డబ్బులు పొందవచ్చు.
భారత్ కు మేల్కొలుపు...
పాక్-సౌదీ ఒప్పందం భారత్ కు పారాహుషార్ అనే చెప్పాలి. ఎందుకంటే.. సౌదీ నుంచి వచ్చే డబ్బును పాక్ మళ్లీ టెర్రరిస్టులను ప్రోత్సహించడానికి వాడుతుంది. వారిని భారత్ పైకి ఎగదోస్తుంది. అందుకని మన దేశం ఈ పరిణామాలపై ఓ లుక్ ఎప్పటికీ ఉంచాలి.