పాక్ ప్రేలాపనలు...అండ దొరికింది అనేగా ?
వెనకటికి ఒక సామెత ఉంది. పరమ శివుడి మెడలో ఉన్న పాము గరుడ పక్షిని ఉద్దేశించి క్షేమమా అని ఎకసెక్కంగా పలకరించింది.;
పాకిస్తాన్ ప్రేలాపనలు స్థాయికి మించేస్తున్నాయి. భారత్ తో పోలిస్తే భొగోళికంగా అతి చిన్న దేశం, ఇక భారత్ కి ఉన్న సైన్యం ఇతర రక్షణ ప్రమైన సామర్ధ్యం ముందు పాక్ ఎంతటి బలహీనమో తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అయితే పాక్ స్వయం ప్రకాశం కాదు, భారత్ ని చూసే దానికి ఎవరైనా మద్దతు ఇస్తారు, అది చైనా అయినా అమెరికా అయినా భారత్ మీద అక్కసుతోనే పాక్ ని దగ్గరకు తీస్తారు. అదే తన గొప్పతనం అనుకుని పాక్ భారత్ మీద ఆక్రోశం వెళ్లగక్కుతూ ఉంటుంది.
పరమ శివుని మెడలో పాములా :
వెనకటికి ఒక సామెత ఉంది. పరమ శివుడి మెడలో ఉన్న పాము గరుడ పక్షిని ఉద్దేశించి క్షేమమా అని ఎకసెక్కంగా పలకరించింది. అవును శివుని మెడలో ఉన్నంతవరకు అని గరుడ పక్షి కూడా ధీటైన జవాబు ఇచ్చింది అవును శివును మెడ నుంచి జారిపడిన మరుక్షణం గరుడ పక్షి పామును ఎంతలా చీల్చి చెండాడుతుందో అందరికీ ఎరుకే. ఇపుడు పాక్ స్థితి కూడా అలాగే ఉంది. పాక్ సైన్యాధ్యక్షుడు కూడా అమెరికా వెళ్ళి అక్కడ నుంచి భారత్ ని హెచ్చరిస్తున్నారు. అమెరికా నీడలో ఉంటూ వార్నింగులు ఇస్తున్నారు.
దూరం పెరిగిందనేనా :
డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల భారత్ తో ఇటీవల కాలంలో కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. అయితే ఇది తాత్కాలికమే అన్నది అందరికీ తెలుసు. ఈ రోజున భారత్ లేకుండా ప్రపంచంలో ఏ దేశమూ మనజాలని పరిస్థితి ఉంది. అతి పెద్ద మార్కెట్, మానవ వనరులు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఇవన్నీ కలసి భారత్ మీద మనసులో ఎవరికి ఏమున్నా కూడా దగ్గరకు తీసుకునేలా చేస్తున్నాయి. ట్రంప్ సైతం మొండిగా ముందుకు సాగుతున్నారు కానీ ఎంతకాలం అలా ఉంటారు అన్నది కూడా తెలియదు. ఆనాడు పాక్ కి కళ్ళు తెరచుకుంటాయని అంటున్నారు.
తెగించిన మాటలు :
ఒక ఉగ్రవాది ఒక ఉన్మాది ఒక మానవ బాంబు చేసిన ప్రకటనల మాదిరిగా పాక్ సైన్యాధ్యక్షుడి ప్రకటనలు ఉన్నాయని అంటున్నరు మేమూ పోతాం మాతో పాటు సగం భారత్ ని లేపుకుని పోతామని పాక్ సైన్యం అధ్యక్షుడు అనాల్సిన మాటలేనా అన్న చర్చ సాగుతోంది. బహుశా ఈ ప్రపంచంలో ఏ దేశమూ ఇంతలా తెగించి మాట్లాడదు, అది ఒక్క పాక్ కే సాధ్యం అని అంటున్నారు. అణు బాంబులు ఉన్నాయని బెదిరిస్తోంది. గతంలో కూడా తాము తయారు చేస్తున్న అణు బాంబులు భారత్ మీదనే అని నిస్సిగ్గుగా చెప్పిన ఘనత పాక్ దే. ఇపుడు మరింత ముందుకెళ్ళి భీకరమైన ప్రకటనలు చేస్తోంది.
అత్యంత ప్రమాదం :
పాక్ ఆర్మీ అధినేత నుంచి వచ్చిన ఈ ప్రకటనలు కేవలం భారత్ పాక్ ల మధ్య దాయాది పోరుగానో లేక మరో విధంగానో ప్రపంచం లైట్ తీసుకుంటే మాత్రం ముప్పు ప్రపంచానికే అని అంటున్నారు. పాక్ ఈ రోజున తన స్వాధీనంలో లేదు. అక్కడ ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే ఉందని అంటారు. సైన్యం పాక్ గద్దెపై పేరుకు మాత్రమే ఏలికలు అన్న వారిని కూర్చోబెట్టి ఆడిస్తుంది అంటారు. మరి పాక్ సైన్యాన్ని ఆడించేది ఉగ్ర మూకలు. వారి చేతిలో అణు బాంబులు కనుక చిక్కితే పాక్ సైన్యం అధ్యక్షుడు మాటలే నిజం చేస్తారు అన్న ఆందోళన కూడా ఉంది. అయినా ఉన్మాద వైఖరితో ఉన్న పాక్ నుంచి అణు ఆయుధాలను సేకరించి ఆ దేశాన్ని అణు అస్త్రాల రహిత దేశంగా మార్చకపోతే అది ప్రపంచానికే ముప్పు. ఈ సంగతిని గుర్తించని దేశాలు పాక్ కి మద్దతు ఇస్తూ భారత్ పట్ల గుడ్డి వ్యతిరేకతతో ముందుకు సాగితే మాత్రం అది అందరికీ ప్రమాదమే అని అంటున్నారు