పులిని చూసి నక్క వాత పెట్టుకుంది.. చేతిలో 'చిప్ప'.. రక్షణకు 'అప్ప'.. ఇదీ ‘పాక్’ ముచ్చట..
సరే, అప్పులు చేసి మరీ రక్షణ బడ్జెట్ పెంచారు కదా.. మరి భారత్‌కు గట్టి పోటీ ఇస్తున్నారా? అంటే.. అక్కడ నవ్వులాట మొదలైంది.
ఇంట్లో ఈగలు తోలుకోవడానికి ఓపిక లేదు కానీ.. ఊరంతా ఊరేగింపు చేస్తానందట వెనకటికి ఒక ఆవిడ.. సరిగ్గా ఇప్పుడే మన పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. తినడానికి తిండి లేదు.. కట్టుకోవడానికి బట్ట లేదు.. చేతిలో పైసా లేదు.. కానీ పక్క దేశంపైకి కత్తులు దూయడానికి మాత్రం బడ్జెట్లు పెంచేస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఐఎంఎఫ్ ఆఫీసు చుట్టూ "భిక్షాందేహి" అంటూ తిరుగుతున్న పాకిస్థాన్.. తాజాగా తన రక్షణ బడ్జెట్‌ను ఏకంగా 17.6 శాతం పెంచేసి రూ. 94,000 కోట్లకు చేర్చింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోయిందో లేక పక్కనున్న భారత్‌ను చూసి అసూయ పడిందో కానీ.. ఉన్న కాస్త డబ్బును కూడా తుపాకులు, ఫిరంగులకు తగలేయడానికి సిద్ధపడింది.
ఐఎంఎఫ్ కిస్తీలు.. డిఫెన్స్ బడ్జెట్ మస్తీలు!
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే.. రేపు పొద్దున దేశంలో సబ్బులు, పప్పులు కొనాలన్నా పక్క దేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిందే. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది, నిరుద్యోగం తాండవిస్తోంది. ప్రజలు పిండి బస్తాల కోసం కొట్టుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో ఏ దేశ ప్రధానికైనా ఏం గుర్తొస్తుంది. "ప్రజల ఆకలి తీర్చాలి" అని గుర్తొస్తుంది. కానీ పాక్ పాలకులకు మాత్రం "భారత్‌కు పోటీ ఇవ్వాలి" అని గుర్తొచ్చింది. "సొంతంగా నడవడానికే సాయం కావాలి.. కానీ పరుగు పందెంలో ఉసేన్ బోల్ట్‌తో పోటీ పడతానంటోంది పాక్. ఈ బడ్జెట్ పెంపుతో పాకిస్థాన్ ప్రజల కడుపులు కాలుతాయే తప్ప దేశానికి వచ్చే రక్షణ ఏమీ లేదు.
భారత్ ఎక్కడ? పాక్ ఎక్కడ?
సరే, అప్పులు చేసి మరీ రక్షణ బడ్జెట్ పెంచారు కదా.. మరి భారత్‌కు గట్టి పోటీ ఇస్తున్నారా? అంటే.. అక్కడ నవ్వులాట మొదలైంది. 2025-26 భారత రక్షణ బడ్జెట్ రూ. 7.85 లక్షల కోట్లు వెచ్చించింది. స్వదేశీ టెక్నాలజీ, యుద్ధ విమానాలు, స్పేస్ డిఫెన్స్, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళుతోంది. 2025-26 పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కు కేటాయించింది రూ. 94 వేల కోట్లతో అప్పుల బడ్జెట్ పాత ఆయుధాల మెయింటెనెన్స్, ఐఎంఎఫ్ ఆంక్షలతో నెట్టుకొస్తోంది. భారత్ బడ్జెట్ రూ.7.85 లక్షల కోట్లు అయితే.. పాక్ బడ్జెట్ కేవలం రూ.94 వేల కోట్లు. అంటే.. భారత్ కేటాయించిన దాంట్లో పాక్ బడ్జెట్ ఒక ముక్కతో సమానం. భారత్ సైనికుల జీతభత్యాలు, పెన్షన్లకే పాక్ బడ్జెట్ సరిపోతుందేమో.. అయినా సరే "మేము కూడా రక్షణ బడ్జెట్ పెంచాం.. భారత్‌కు పోటీ ఇస్తాం" అంటూ బిల్డప్ ఇవ్వడంలో పాకిస్థాన్‌ను మించిన వారు లేరు.
పోటీ కాదు.. ఆత్మహత్యా సదృశ్యం!
భారత్ ఈరోజు అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు.. రాఫెల్ యుద్ధ విమానాలు, సొంత విమాన వాహక నౌకలతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైనిక శక్తిగా దూసుకుపోతోంది. పైగా ఈ ఖర్చంతా భారత్ తన సొంత సంపాదనతో పెట్టుకుంటోంది.
కానీ పాకిస్థాన్ చైనా ఇచ్చే పాత సామాన్లు, ఐఎంఎఫ్ ఇచ్చే అప్పు ముక్కలతో బండి లాగిస్తోంది. ఎంత బడ్జెట్ పెంచినా ఆ డబ్బులు వడ్డీలు కట్టడానికే సరిపోవు. ఇవన్నీ పక్కన పెట్టి రక్షణ రంగంలో భారత్‌కు పోటీ అనడం.. "పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే" ఉంది.
పాకిస్థాన్ తన డిఫెన్స్ బడ్జెట్‌ను ఎంత పెంచినా.. అది భారత్‌కు పోటీ ఇవ్వడానికి కాదు సదా.. కేవలం తన ఆత్మసంతృప్తి కోసం.. దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమేనని రక్షణ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.