పాక్ ఆర్మీకి ‘ఇంగ్లీష్’ భయం.. భారత సైనికాధికారుల ప్రసంగాలపై అహ్మద్ షరీఫ్ విడ్డూరపు వ్యాఖ్యలు!

ఒక దేశ ఆర్మీ ప్రతినిధి స్థాయి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలు ఒక్కోసారి వారికే వెనక్కి తిరిగి తగిలి అభాసుపాలయ్యేలా చేస్తాయి.;

Update: 2026-05-09 07:13 GMT

ఒక దేశ ఆర్మీ ప్రతినిధి స్థాయి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలు ఒక్కోసారి వారికే వెనక్కి తిరిగి తగిలి అభాసుపాలయ్యేలా చేస్తాయి. సరిహద్దుల్లో వ్యూహాత్మక విజయాల గురించి మాట్లాడడం మానేసి, భారత సైనికాధికారులు వాడే భాషను తప్పుపట్టడం చూస్తుంటే పాక్ ఆర్మీ ఎంత అసహనంతో ఉందో అర్థం అవుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ వార్షికోత్సవం వేళ భారత్ సాధించిన ఘనతను ప్రపంచానికి వివరించడాన్ని తట్టుకోలేక, ఇలా భాష గురించి విమర్శలు చేసి ఇప్పుడు తమ సొంత దేశస్తుల నుంచే చీత్కారాలు ఎదుర్కోవడం గమనార్హం. భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత సైనికాధికారులు ప్రపంచ దేశాలకు తమ విజయాన్ని వివరించడానికి ఆంగ్ల భాషను వాడడంపై పాక్ ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ విమర్శలు కాస్తా పాక్ ఆర్మీకే బూమరాంగ్ గా మారాయి.

భాషపై పాక్ ఆర్మీ వింత ఆరోపణలు

ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవ వేళ పాక్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భారత సైనికాధికారులు ఇంగ్లిష్‌లో మాట్లాడడం వెనుక తమ వాదనను ప్రపంచానికి బలంగా వినిపించాలనే ఉద్దేశం ఉందని ఆయన అన్నారు. సైనిక పరమైన అంశాలను వదిలేసి భాషను విమర్శించడంతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఎగతాళికి గురయ్యారు. అహ్మద్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారతీయుల కంటే ఎక్కువగా పాకిస్థానీలే స్పందించడం విశేషం. విదేశీ వేదికలపై భాష కంటే విషయం ముఖ్యమని, భారత్ తన వాదనను ప్రపంచానికి స్పష్టంగా వినిపిస్తోందని నెటిజన్లు ఆయనను ఎద్దేవా చేశారు. పాక్ మాజీ అధికారి ఆదిల్ రజా నేరుగా అహ్మద్ షరీఫ్‌ను నిలదీశారు. భాష గురించి కాకుండా, భారత్ ధ్వంసం చేశామని చెబుతున్న 11 ఎయిర్‌బేస్‌లపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

‘ఆపరేషన్ సింధూర్’ పాక్‌కు తీరని గాయం

భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా భారత సైన్యం తన పరాక్రమాన్ని గుర్తు చేసుకుంది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ పాక్ సైనిక స్థావరాలకు భారీ నష్టాన్ని కలిగించిందని, ఆ భయం నుంచే పాక్ ప్రతినిధి ఇలాంటి విడ్డూరపు వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ దేశాలతో సంభాషించేటప్పుడు ఆంగ్లం ఒక అనుసంధాన భాషగా పనిచేస్తుంది. భారత్ తన విజయాన్ని ప్రపంచం ముందు ఉంచడాన్ని తప్పుపట్టడం పాక్ నిస్సహాయతను సూచిస్తోంది. తన దేశం లోపలే ఆర్మీపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో, అహ్మద్ షరీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ ప్రతిష్టను మరింత దిగజార్చాయి.

Tags:    

Similar News