పద్మ పురస్కార గ్రహీతలకు ఇచ్చేది ఏంటంటే ?
దేశంలో పౌర పురస్కారాలకు ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. ఈ పురస్కారాలు నాలుగు కేటగిరీలు గా ఉంటాయి. భారత రత్న ఇందులో అగ్ర తాంబూలంగా ఉంటుంది.;
దేశంలో పౌర పురస్కారాలకు ఎంతో విలువ గౌరవం ఉన్నాయి. ఈ పురస్కారాలు నాలుగు కేటగిరీలు గా ఉంటాయి. భారత రత్న ఇందులో అగ్ర తాంబూలంగా ఉంటుంది. ఇక పద్మ పురస్కారాలలో అత్యున్నతమైనది ద్వితీయమైనది పద్మ విభూషణ్. మూడవ కేటగిరీలో పద్మభూషణ్ ఉంటుంది. పద్మశ్రీ నాలుగో కేటగిరీలో ఉంటుంది. ఇక పద్మ పురస్కారాల ఎంపిక ప్రత్యేకంగా జరుగుతుంది.
కమిటీ ద్వారా :
ఎంతో పారదర్శకంగా పద్మ అవార్డుల ఎంపిక జరుగుతుంది. ప్రధాని ప్రతీ ఏటా పద్మ అవార్డుల కమిటీని ఏర్పాటు చేస్తరు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. గతంలో ఈ కమిటీ ద్వారానే అవార్డుల ఎంపిక జరిగేది. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రజల భాగస్వామ్యం కల్పించారు. ప్రజలు ఎవరైనా అర్హులు ప్రతిభ కలిగిన వారు ఉంటే వారి పేరు సిఫార్సు చేయవచ్చు. అలాగే తాముగా కూడా సెల్ఫ్ నామినేషన్ గా కమిటీకి నివేదించవచ్చు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఇచ్చిన జాబితాను ప్రధాని రాష్ట్రపతి ఆమోదించిన తరువాత గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటిస్తారు. ఇక ప్రతీ ఏటా మార్చి ఏప్రిల్ నెలలలో విడతల వారీగా ఈ పద్మ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
తేడా ఏమిటి అంటే :
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు సాధారణ తీరులో అత్యున్నతమైన సేవలు దేశానికి అందించిన వారుగా ఉంటారు. పద్మభూషణ్ గ్రహీతలు ఏదైనా ఒక రంగం తీసుకుని అందులో అగ్ర స్థానానికి చేరుకుని అందరి మన్ననలు అందుకుంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఏ రంగంలోనైనా ప్రతిభావంతమైన సేవలు అందించి జనం మెప్పు పొందుతారు సామాన్యులు కూడా పద్మశ్రీ అవార్డులు పొందేందుకు అర్హులుగా ఉంటారు.
ఇచ్చేది ఏంటంటే :
పద్మ పురస్కార గ్రహీతలకు నగదు బహుమతి ఇస్తారు అన్నది ఒక అపోహ మాత్రమే. అలాంటిది ఏదీ ఇవ్వరు. రాష్ట్రపతి సంతకంతో ప్రశంసా పత్రం, అలాగే ఒక పతకాన్ని అందిస్తారు. పద్మ అవార్డీలకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు అధికారిక ఆహ్వానం ఉంటుంది. వారిని రాష్ట్ర అతిధులుగా చూస్తారు. వారు ఏదైనా పని మీద ఇతర రాష్ట్రాలకు వెళ్తే ప్రభుత్వ అతిధి గృహంలో వారికి వసతి సదుపాయంతో పాటు రక్షణ కల్పిస్తారు. అలాగే దేశంలోని రైళ్ళలో ఉచిత ప్రయాణం చేయవచ్చు.
నిబంధనలు పాటించాల్సిందే :
పద్మ అవార్డులు ఒక గుర్తింపు గౌరవంగా మాత్రమే ఉంటాయి. ఇవి బిరుదు అన్నది ఎంత మాత్రం కాదు, అందువల్ల తమ పేరుకు ముందు లేదా వెనక ఎవరైనా వీటిని వినియోగిస్తే వెంటనే ఆ అవార్డులను వెనక్కి తీసుకుంటారు. ఆ అధికారం ప్రభుత్వానికి ఎపుడూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఎంతో మంది సామాన్యులకు కూడా పద్మశ్రీలు దక్కుతున్నాయి. దానికి కారణం కేంద్రం సవరించిన నిబంధనలు ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం అని అంటారు.