'అతి' కూడా మంచిది కాదేమో బాబూ.. !

`అతి` ఎప్పుడూ మంచిది కాదు. అది రాజకీయాలైనా, వ్యక్తిగతమైన, కుటుంబ సంబంధాలైన అతిగా వ్యవహరించిన, అతిగా మాట్లాడిన, అతిగా విమర్శించిన.. ఎప్పటికీ అది ప్రమాదకరమైన సంకేతాల‌నే ఇస్తుంది.;

Update: 2025-07-05 12:30 GMT
అతి కూడా మంచిది కాదేమో బాబూ.. !

`అతి` ఎప్పుడూ మంచిది కాదు. అది రాజకీయాలైనా, వ్యక్తిగతమైన, కుటుంబ సంబంధాలైన అతిగా వ్యవహరించిన, అతిగా మాట్లాడిన, అతిగా విమర్శించిన.. ఎప్పటికీ అది ప్రమాదకరమైన సంకేతాల‌నే ఇస్తుంది. అతిగా విమర్శించి, అతిగా తిట్టిపోసిన నాయకులు తర్వాత కాలంలో రాజకీయంగా పుంజుకున్నారనేది అందరికీ తెలిసిందే. ఉదాహరణకు ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఆయనను సంఘ విద్రోహ శక్తిగా.. మతాల మధ్య చిచ్చుపెట్టే నాయకుడిగా.. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేక వ్యక్తిగా కూడా దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది.

కానీ ఇదే వ్యతిరేక ప్రచారం.. నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో చర్చకు వచ్చేలాగా చేసింది. తర్వాత కాలంలో ఆయన ప్రధాని కావడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యతిరేక ప్రచారం ఒక కారణమనేది రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఆయన ఒక్కడే కాదు కేసీఆర్ను కూడా గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అసెంబ్లీలోను బయట కూడా విమర్శలు గుప్పించేవారు. `మీ వల్ల ఏం జరుగుతుంది. మీరు ఏం సాధిస్తారు` అని వైయస్ అడిగిన ప్రశ్నలు అసెంబ్లీలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఆ తర్వాత బహిరంగ సభలో కూడా కేసీఆర్ వల్ల ఏమీ కాదని చెప్పుకొచ్చారు.

ఇలా కేసీఆర్ ను ఒక విలన్ గా, ఒక రాజకీయ అసమర్ధుడిగా చేసిన ప్రచారం.. తర్వాత కాలంలో ఆయనను ప్రజల్లో మరింత రాటు తేలే నాయకుడిగా మార్చాయి. అంటే అతిగా ప్రచారం చేయటం అనేది ఆనాడైనా.. ఏనాడైనా రాజకీయాల్లో మంచిది కాదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ ను మరింతగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అంత మంచిది కాదనే అభిప్రాయం టిడిపి నాయకులు మధ్య వినిపిస్తోంది. సీనియర్ నాయకుల నుంచి జూనియర్ నాయకుల వరకు కూడా జగన్‌ను అనవసరంగా మనం ఎక్కువగా టార్గెట్ చేస్తున్నామేమో అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒకరిద్దరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. ఇదే అభిప్రాయాన్ని చంద్రబాబు ముందు చెప్పుకొచ్చారు. మనం అనవసరంగా జగన్ను టార్గెట్ చేయడం వల్ల ఆయనపై ప్రజల్లో నిరంతరం చర్చకు వచ్చేలాగా చేస్తున్నామేమో అన్న సందేహాలను వ్యక్తం చేశారు. కానీ దీని విషయంలో చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు. ``నాకు తెలియదా? మీరా నాకు చెప్పేది? నేను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మీరు ఒక్కసారి గెలిచారు. మీరు నాకు పాఠాలు చెబుతారా?`` అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. కానీ వారు చెప్పిన దాంట్లో ఒకంత వాస్తవం అయితే లేకపోలేదు.

ఎందుకంటే అతిగా విమర్శిస్తూ పోతే జగన్‌ను విల‌న్‌గా చూపిస్తూ పోతే ప్రజల్లో ఆయన పట్ల సానుకూలత, సానుభూతి పెరిగే అవకాశం లేకపోలేదు, ఇది రాజకీయాల్లో సహజంగా ఏర్పడేటటువంటి ఒక ప్రక్రియ. గతంలో జగన్ కూడా పవన్ కళ్యాణ్ ను పదేపదే విమర్శించడం వల్ల కాపులంతా ఏకమయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు. ఇది ఆయనకు ఎంత మేలు చేసిందో ఎంత కీడు చేసిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా చంద్రబాబును ఇక జైలుకే పరిమితం చేయాలి అని ఊహించి ఆయనను ఇబ్బంది పెట్టిన తీరు, అసలు టిడిపి లేకుండా చేయాలి.. మనమే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి.. అనే విధంగా వ్యవహరించిన విధానం వంటివి కూడా జగన్ను తీవ్ర స్థాయిలో ఇరకాటంలోకి నెట్టి చివరకు ఏం చేశాయి అనేది అందరికీ అర్థమైంది.

ఇంత పరిస్థితి టిడిపికి రాకపోయినా ఇప్పుడు జనంలో జగన్ గురించి చర్చ వచ్చేలాగా చంద్రబాబు పదేపదే ఆయనను టార్గెట్ చేయడం మంచిది కాదన్నది పార్టీ నాయకులు సూచిస్తున్న మాట. అవకాశం, అవసరం, సందర్భాన్ని బట్టి ప్రతిపక్షాన్ని విమర్శించడం వరకు తప్పు లేదని, కానీ ప్రతి విషయంలోను జగన్‌ను టార్గెట్ చేయటం ప్రతి విషయాన్ని ఆయనకు ముడిపెట్టి విమర్శించడం వల్ల కొత్తగా వచ్చే లాభం ఏమీ లేదని అంటున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ వ్యూహంతో ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News