టాప్ స్టోరి: చెత్త కుండీల నుండి 5 లక్షల కోట్ల సంపద సృష్టి?
ఈ వ్యర్థాల ఆర్థిక వ్యవస్థలో ఊహించని స్థాయిలో ఉపాధి అవకాశాలు దాగి ఉన్నాయి.
భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న మురికికూపాలు, చెత్త కొండలు త్వరలోనే దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరుగా మారే అవకాశం ఉందని `కౌన్సిల్ ఆన్ ఎనర్జీ- ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్` (CEEW) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలోని పట్టణ ప్రాంతాల నుండి ప్రతిరోజూ వెలువడే వంటగది వ్యర్థాలు, కూరగాయలు, పూలు, మాంసం, ఉద్యానవన వ్యర్థాల వంటి `ఆర్గానిక్ వేస్ట్` (సేంద్రీయ వ్యర్థాలు) ను సరిగ్గా నిర్వహించగలిగితే.. 2047 నాటికి ఏకంగా 55 బిలియన్ల (సుమారు 5 లక్షల కోట్ల) మార్కెట్ అవకాశం లభిస్తుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇది కేవలం వ్యర్థాల నిర్మూలన మాత్రమే కాకుండా ఉపాధి కల్పన, స్వచ్ఛమైన గాలి, ఇంధన భద్రత.. నగరాల భవిష్యత్తును మార్చే ఒక విప్లవాత్మకమైన అడుగు.
ప్రస్తుతం భారతదేశంలోని నగరాలు మునిసిపాలిటీలు తట్టుకోలేనంత వేగంగా చెత్తను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలో ప్రతిరోజూ దాదాపు 1.71 లక్షల టన్నుల మునిసిపల్ ఘన వ్యర్థాలు వస్తుండగా అందులో సగం సేంద్రీయ వ్యర్థాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇందులో 61 శాతం వ్యర్థాలను మాత్రమే రీసైకిల్ లేదా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. మిగిలిన చెత్త ల్యాండ్‌ఫిల్‌లలో పేరుకుపోవడం లేదా బహిరంగంగా తగులబెట్టడం వల్ల నగరాలలో తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. 1994 నుండి 2020 మధ్య కాలంలో వ్యర్థాల నుండి వెలువడే హానికరమైన గ్రీన్‌హౌస్ ఉద్గారాలు 226 శాతం పెరిగాయి. 2047 నాటికి ఈ పట్టణ సేంద్రీయ వ్యర్థాలు ఏటా 208 మిలియన్ టన్నులకు చేరుకునే ప్రమాదం ఉంది.
ఈ సంక్షోభాన్ని ఆర్థిక ఇంజిన్‌గా మార్చడానికి సిఇఇడబ్ల్యూ మూడు నమూనాలను ప్రతిపాదించింది. ప్రస్తుత నెమ్మదైన పద్ధతినే కొనసాగిస్తే ఉద్గారాలు 120 మిలియన్ టన్నులకు పెరుగుతాయి. కానీ `వేగవంతమైన విధానం` ద్వారా 95 శాతం వ్యర్థాలను కంపోస్టింగ్, బయో-మిథనేషన్ ప్రక్రియల ద్వారా రీసైకిల్ చేస్తే.. 2047 నాటికి 68 మిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించవచ్చు. మరింత దూకుడుగా 100 శాతం వ్యర్థాలను సేకరించి బయో-సీఎన్‌జీ ఉత్పత్తి వైపు మళ్ళిస్తే.. ఈ మార్కెట్ విలువ 62 బిలియన్లకు చేరడమే కాకుండా 100 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను అడ్డుకోవచ్చు. వ్యర్థాల నుండి కంపోస్ట్ ఎరువులు, బయో-గ్యాస్ - పెట్రోలియం ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పనిచేసే బయో-సీఎన్‌జీని తయారు చేయడం ద్వారా దేశ ఇంధన భద్రత మెరుగుపడుతుంది.
ఈ వ్యర్థాల ఆర్థిక వ్యవస్థలో ఊహించని స్థాయిలో ఉపాధి అవకాశాలు దాగి ఉన్నాయి. రోజుకు 100 టన్నుల సామర్థ్యం గల బయో-మిథనేషన్ ప్లాంట్‌కు టెక్నీషియన్లు, కెమిస్ట్‌లు, లేబర్‌తో కలిపి 31 మంది కార్మికులు అవసరమవుతారు. కంపోస్టింగ్ ప్లాంట్‌కు 28 మంది అవసరమవుతారు. ప్రభుత్వాలు సరైన విధానాలు అవలంబిస్తే ఈ రంగంలో ప్రత్యక్ష ఉపాధి ప్రస్తుతమున్న 4 లక్షల నుండి 2047 నాటికి ఏకంగా 26 లక్షల గ్రీన్ జాబ్స్ (హరిత ఉద్యోగాలు) కు పెరుగుతుంది. సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, ఇంధన ఉత్పత్తి, ఎరువుల మార్కెటింగ్ రంగాలలో భారీ ఎత్తున కొత్తగా ఉద్యోగాలు పుడతాయి. వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం పారిశుధ్య సమస్య కాదు.. అది స్వచ్ఛమైన గాలిని ఇచ్చే కనీస అవసరంగా చూడాలి.
అయితే స్వచ్ఛ భారత్ మిషన్, గోబర్ధన్, సతత్ (ఎస్.ఏ.టి.ఏ.టి) వంటి 16 ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పథకాలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో సరైన సమన్వయం, అమలు లోపించడమే ప్రధాన సమస్యగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అమలులోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు- 2026 ప్రకారం మూలం వద్దే చెత్తను వేరు చేయడం (తడి, పొడి చెత్త) తప్పనిసరి అయింది. ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో లాభసాటిగా మార్చడానికి.. చెత్త సేకరణ కాంట్రాక్టులను బరువు ఆధారంగా కాకుండా నాణ్యత ఆధారంగా ఇవ్వాలని గ్రీన్ బాండ్స్, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్స్ (పీపీపీ) వంటి వినూత్న ఆర్థిక వనరులను ప్రోత్సహించాలని బయో-సీఎన్‌జీకి స్థిరమైన మార్కెట్‌ను సృష్టించాలని విస్త్రతమైన సర్వే రిపోర్ట్ సిఫార్సు చేస్తోంది.