ఆ 25 నిమిషాలు... పాక్‌లో భారత సైన్యం విధ్వంసం.. ఆపరేషన్ సింధూర్ ఇన్సైడ్ స్టోరీ!

ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే పూర్తయిందని, భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు.;

Update: 2025-05-07 08:20 GMT

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచానికి తెలియజేశారు. ఈ ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే పూర్తయిందని, భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు.

కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ..మే 7న రాత్రి 1.05 గంటలకు భారత వైమానిక దళం పాకిస్తాన్, పీవోకేలోకి చొచ్చుకెళ్లి ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిందని.. ఈ ఆపరేషన్ దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగిందని తెలిపారు. భారత వైమానిక దళం వరుసగా పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను ఎలా ధ్వంసం చేసిందో ఆమె వివరించారు.

25 నిమిషాల్లో టెర్రరిస్టులు ఖతం

సోఫియా ఖురేషి చెప్పిన దాని ప్రకారం, భారత వైమానిక దళం దాదాపు 25 నిమిషాల పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఈ సమయంలో వారు టెర్రరిస్టుల 9 స్థావరాలను పూర్తిగా నాశనం చేశారు. ఈ స్థావరాల నుంచే భారత్‌పై అనేక టెర్రరిస్ట్ దాడులకు కుట్రలు జరిగాయని, భవిష్యత్తులో కూడా దాడులు చేయడానికి ప్లాన్లు వేస్తున్నారని ఆమె తెలిపారు. వారు టార్గెట్ చేసిన అన్ని స్థావరాల గురించి వివరంగా చెప్పారు. ఏ క్యాంపు నుంచి ఏ దాడులకు కుట్ర జరిగిందో కూడా వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు ఎంత నష్టం జరిగిందంటే...

భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్, పీవోకేలోని 9 టెర్రరిస్ట్ స్థావరాలను టార్గెట్ చేసింది. వార్తల ప్రకారం ఈ దాడిలో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం పౌరుల కోసం అనేక సూచనలు జారీ చేసింది. మరోవైపు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తరార్ ఈ దాడికి బదులిస్తామని బెదిరించారు. అయితే భారత సైన్యం తన చర్యను సమర్థించుకుంది. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags:    

Similar News