పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌ హతం... ఎవరీ సులేమాన్..?

అవును... జమ్మూకశ్మీర్‌ లోని శ్రీనగర్‌ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.;

Update: 2025-07-29 05:15 GMT

పహల్గాం ఉగ్రదాడి జరిగిన 100 రోజులు పూర్తికావొస్తున్నా ఇప్పటికీ ఆ దాడికి కారకులైన ఉగ్రమూకలను పట్టుకోలేదని విమర్శలు వినిపిస్తున్న వేళ.. సైన్యం నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో భాగంగా.. జమ్మూ కశ్మీర్‌ లో సైన్యం ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్ర దాడికి కుట్ర పన్నిన కీలక ముష్కరుడు సులేమాన్ కూడా ఉన్నాడు.

అవును... జమ్మూకశ్మీర్‌ లోని శ్రీనగర్‌ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 'ఆపరేషన్‌ మహాదేవ్‌' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌ లో పహల్గాం ఉగ్ర దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్‌ అలియాస్‌ అలియాస్ హషీమ్ మూసాతోపాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు. ఇది సైన్యానికి భారీ విజయం!

ఈ సందర్భంగా స్పందించిన కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్డి... సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్‌ సభ్యులు, 4వ పారా యూనిట్‌ సిబ్బంది.. ముల్నార్‌ గ్రామ సమీపంలో ముగ్గురు ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని.. ఈ క్రమంలో చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత ముగ్గురు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మూడు గంటల్లో మేటర్ ఫినిష్!:

తాజాగా కశ్మీర్ జోన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో... పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌ సులేమాన్‌ షా అలియాస్‌ హషీమ్‌ మూసాను సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... అతడి పనిని సైన్యం మూడు గంటల్లో ముగించేసిందని చెబుతున్నారు. అతడి జాడను గుర్తించిన వెంటనే మెరుపు వేగంతో ఆపరేషన్‌ చేపట్టిన కమాండోలు... తొలి కాల్పుల్లోనే మట్టుబెట్టేశారు.

ఎవరీ సులేమాన్‌?:

జమ్మూ కశ్మీర్‌ లో జరిగిన తాజా ఆపరేషన్ లో హతమైన పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి సులేమాన్‌ అలియాస్ హషీమ్ మూసా.. గతంలో పాకిస్థాన్‌ సైన్యంలో పని చేశాడు. ఆ తరువాత లష్కరే తోయిబాతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో.. పహల్గాం దాడికి పాల్పడ్డాడు. ఆ దాడి తర్వాత మధ్య కశ్మీర్‌ లోని గండేర్‌ బల్‌ లో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజా ఆపరేషన్ లో హతమయ్యాడు.

Tags:    

Similar News