చాట్ జీపీటీలో అదిరిపోయే ఫీచర్.. ఇకపై మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డులన్నీ ఏఐతో లింక్.. ఖర్చుల రాత మార్చనున్న ఓపెన్ఏఐ!

ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడి) ఖాతాలను నేరుగా చాట్ జీపీటీకి అనుసంధానించుకోవచ్చు.

Update: 2026-05-17 07:57 GMT

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ఇప్పటివరకు కేవలం కవితలు రాయడానికి.. కోడింగ్ చేయడానికి.. సందేహాలను నివృత్తి చేయడానికి మాత్రమే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ), ఇప్పుడు నేరుగా మీ జేబులోకి మీ బ్యాంక్ ఖాతాల్లోకి అడుగుపెడుతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం ఓపెన్ ఏఐ తన చాట్‌బాట్ చాట్ జీపీటీలో అత్యంత శక్తివంతమైన “ఫైనాన్సెస్” అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను ఎంతో సులువుగా మేనేజ్ చేసుకోవచ్చు.

ఒకే చోట అన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు!

ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడి) ఖాతాలను నేరుగా చాట్ జీపీటీకి అనుసంధానించుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత యూజర్ల నెలవారీ ఖర్చులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, యాప్ సబ్‌స్క్రిప్షన్లు, రాబోయే బిల్లులు, లోన్లు (అప్పులు) వంటి అన్ని ఆర్థిక వివరాలను చాట్ జీపీటీ ఒకే వినూత్నమైన డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది.

ప్రస్తుతం ఈ అధునాతన సదుపాయం అమెరికాలోని ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. నెలకు 200 డాలర్లు సుమారు ₹16,500 కంటే ఎక్కువ చెల్లించే ప్రీమియం యూజర్లు దీనిని వాడుకోవచ్చు. అయితే త్వరలోనే దీనిని 'ప్లస్' వినియోగదారులకు, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓపెన్ ఏఐ అధికారికంగా ప్రకటించింది.

అకౌంట్లను ఎలా లింక్ చేయాలి?

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ఎంతో సులభం. వినియోగదారులు చాట్ జీపీటీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో “ఫైనాన్స్” సెక్షన్‌ను ఓపెన్ చేయాలి. లేదా చాట్ విండోలోనే “@Finances, connect my accounts” అని టైప్ చేస్తే సరిపోతుంది. భద్రత కోసం ఓపెన్ ఏఐ ఇందులో ప్లయిడ్ అనే ప్రముఖ సెక్యూర్ ఫైనాన్షియల్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించింది.

ఈ ప్లాయిడ్ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం అమెరికాలోని 12 వేలకు పైగా ఆర్థిక సంస్థలతో అనుసంధానమై ఉంది. ఇందులో చేజ్, ఫిడిలిటీ, ష్వాబ్, రాబిన్‌హుడ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్యాపిటల్ వన్ వంటి దిగ్గజ బ్యాంకులు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఉన్నాయి.

మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా సమాధానాలు!

ఖాతాలు కనెక్ట్ అయిన తర్వాత చాట్ జీపీటీ ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌లా మారిపోతుంది. మీ ఖర్చుల సరళిని పూర్తిగా విశ్లేషించి మీరు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఉదాహరణకు "ఈ నెల నా బడ్జెట్ దాటి నేను ఎక్కువ ఖర్చు చేస్తున్నానా? ప్రస్తుతం ఉన్న నా ఆదాయం, పెట్టుబడులతో నేను ఐదేళ్లలో సొంత ఇల్లు కొనగలనా? నేను ఉపయోగించకుండానే నెలనెలా డబ్బులు కట్ అవుతున్న సబ్‌స్క్రిప్షన్లు ఏవైనా ఉన్నాయా?" వంటి ప్రశ్నలకు క్షణాల్లో ఖచ్చితమైన విశ్లేషణను అందిస్తుంది. ఓపెన్ ఏఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ అత్యంత శక్తివంతమైన జీపీటీ -5.5 థికింగ్ మోడల్‌పై పనిచేస్తుంది. ఇంకా క్లిష్టమైన దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విశ్లేషణ కోసం జీపీటీ-5.5 ప్రో మోడల్‌ను కూడా రంగంలోకి దించారు.

భద్రత, ప్రైవసీ ఎలా ఉంది?

బ్యాంక్ ఖాతాలను ఏఐకి లింక్ చేయడం అనగానే అందరిలోనూ ప్రైవసీ భయాలు మొదలవడం సహజం. దీనిపై ఓపెన్ఏఐ గట్టి హామీలను ఇచ్చింది. చాట్ జీపీటీ కేవలం వినియోగదారుల బ్యాలెన్సులు, లావాదేవీలు, పెట్టుబడుల సమాచారాన్ని మాత్రమే ‘చదవగలదు’. మీ అనుమతి లేకుండా లేదా చాట్ జీపీటీ ద్వారా ఎలాంటి నగదు బదిలీలు చేయడం సాధ్యం కాదు. అలాగే పూర్తి బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఏఐ కి కనిపించవు. వినియోగదారులు ఎప్పుడైనా తమ అకౌంట్లను డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలా చేసిన 30 రోజుల్లోగా సింక్ చేసిన డేటా మొత్తం సర్వర్ల నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది.

ఇందులో “ఫైనాన్షియల్ మెమరీస్” అనే ప్రత్యేక ఆప్షన్ ఉంది. మీకు హోమ్ లోన్ ఉందా, లేదా కుటుంబ సభ్యులకు ఏమైనా అప్పులు ఉన్నాయా అనే విషయాలను చాట్ జీపీటీ గుర్తుంచుకుని, భవిష్యత్తులో మీరు అడిగే ప్రశ్నలకు మరింత వ్యక్తిగతీకరించిన సమాధానాలు ఇస్తుంది. ఒకవేళ ప్రైవసీ వద్దనుకుంటే ఈ మెమరీస్‌ను యూజర్ ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. అలాగే, “టెంపరరీ చాట్స్” లో మాట్లాడితే ఈ ఆర్థిక డేటా అసలు సేవ్ కాదని సంస్థ స్పష్టం చేసింది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ఓపెన్ ఏఐ మాస్టర్ ప్లాన్!

ఈ విప్లవాత్మక ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి నెలరోజుల ముందే ఓపెన్ ఏఐ “హిరో” అనే పర్సనల్ ఫైనాన్స్ స్టార్టప్‌ను రహస్యంగా కొనుగోలు చేసింది. ఆ స్టార్టప్ యొక్క నిపుణుల బృందమే ఈ చాట్ జీపీటీ ఫైనాన్స్ ఫీచర్‌ను ఇంత అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే ప్రముఖ ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ టుయిట్ సపోర్ట్‌ను కూడా దీనికి జోడించనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో స్టాక్ అమ్మకాలపై పన్నుల అంచనా క్రెడిట్ కార్డ్ అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వంటి మరిన్ని సంక్లిష్టమైన సేవలు నేరుగా చాట్ జీపీటీ లోనే అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటివరకు ఇలాంటి ఆర్థిక విశ్లేషణల కోసం ప్రత్యేక యాప్‌లు వాడేవారు. కానీ ప్రపంచంలోనే అత్యధిక జనాదరణ పొందిన జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫారమ్ నేరుగా బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కావడం టెక్ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది వినియోగదారుల జీవితాలను సులభతరం చేస్తుందా.. లేదా సైబర్ భద్రత, వ్యక్తిగత ప్రైవసీకి కొత్త సవాళ్లను విసురుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News