క్రికెట్ స్టార్‌ల చేజారిన రూ.200 కోట్లు
భారత ప్రభుత్వం కఠినతరం చేసిన కొత్త గేమింగ్ నిబంధనల వల్ల ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలను, ముఖ్యంగా బెట్టింగ్, జూద కార్యకలాపాలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లు నిషేధింపబడ్డాయి.;
భారత ప్రభుత్వం కఠినతరం చేసిన కొత్త గేమింగ్ నిబంధనల వల్ల ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలను, ముఖ్యంగా బెట్టింగ్, జూద కార్యకలాపాలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లు నిషేధింపబడ్డాయి. ఈ చర్య వలన ఈ యాప్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న భారత క్రికెటర్లు భారీగా ఆర్థిక నష్టాలను చవిచూడనున్నారు. ఈ నిషేధం వల్ల భారత క్రికెటర్లు సుమారు రూ. 200 కోట్లు వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అంచనా.
- ఆర్థిక ప్రభావం
ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు క్రికెట్‌కు చాలా కాలంగా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్నాయి. అనేకమంది స్టార్ క్రికెటర్లు ఈ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి ప్రస్తుత ఆటగాళ్లతో పాటు, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ గేమింగ్ యాప్స్ ద్వారా విరాట్ కోహ్లీ ఏడాదికి రూ. 10-12 కోట్లు సంపాదిస్తుండగా.. ఇతర స్టార్ క్రికెటర్లు కూడా కోట్లలో ఆదాయం పొందుతున్నారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.
ఈ ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు డబ్బుతో కూడిన గేమింగ్ కార్యకలాపాలను నిషేధించడంతో క్రికెటర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు కానున్నాయి. దీనివల్ల ఆటగాళ్లు తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోనున్నారు. ఒక అంచనా ప్రకారం, భారత క్రికెటర్లందరూ కలిపి దాదాపు రూ. 200 కోట్లు ఆదాయం కోల్పోవచ్చు.
-భవిష్యత్ సవాళ్లు
ఈ నిషేధం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాకుండా క్రికెటర్ల బ్రాండ్ విలువపై కూడా ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో ఇతర స్పాన్సర్లు కూడా ఇలాంటి గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న క్రీడాకారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వెనుకాడే అవకాశం ఉంది. ఇది భారత క్రికెటర్ల ఆదాయ మార్గాలను ప్రభావితం చేయడమే కాకుండా, క్రీడా ప్రపంచంలో స్పాన్సర్‌షిప్ భవిష్యత్తుపై కొత్త సవాళ్లను సృష్టిస్తుంది.
క్రికెటర్లు ఇప్పుడు కొత్త ఆదాయ వనరులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పాన్సర్‌షిప్‌ల కోసం సంప్రదాయ మార్గాలను తిరిగి అనుసరించడం లేదా ఇతర రంగాలలోని బ్రాండ్లతో భాగస్వామ్యం కావడంపై దృష్టి సారించవచ్చు. అయితే, ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు అందించినంత భారీ రెమ్యునరేషన్ లభించకపోవచ్చు. ఈ మార్పుల వల్ల క్రికెటర్ల ఆదాయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.