గంజాయి బ్యాచ్ కు ఒంగోలు పోలీసుల ట్రీట్ మెంట్ తప్పు లేదు బాస్
కానీ.. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టటంతో విషయం పోలీసుల వరకు వెళ్లారు. మొదట్లో ఈ గొడవ మామూలుగానే భావించినా.. అందులోని గంజాయి కోణం బయటకు వచ్చింది.;
బాధ్యత మరిచి.. మాదకద్రవ్యాలకు అలవాటు పడటం ఒక ఎత్తు.. ఆ మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న వారిపై ఒంగోలు పోలీసులు అనుసరిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ విధానాన్ని మిగిలిన పోలీసులు కూడా ఫాలో కావటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఒంగోలు పోలీసులు ఏం చేశారంటే..
గంజాయికి బానిస అయిన కొందరు యువకులు ఆ మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా చేస్తున్నారు. తాజాగా గంజాయి మత్తులో కొందరు యువకులు గొడవ పడ్డారు. ఈ ఉదంతంలో కొందరు గాయపడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే.. చర్యలు తీవ్రంగా ఉంటాయన్న భయంతో కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి.. సెటిల్ చేసే ప్రయత్నం చేశారు.
కానీ.. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టటంతో విషయం పోలీసుల వరకు వెళ్లారు. మొదట్లో ఈ గొడవ మామూలుగానే భావించినా.. అందులోని గంజాయి కోణం బయటకు వచ్చింది. దీంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ చట్టప్రకారం కఠినమైన కేసులు పెట్టాలని భావించారు. అయితే.. వీరంతా బాగా చదువుకున్న యువకులు కావటంతో.. కేసులతో వారి భవిష్యత్ ను దెబ్బ తీయకూడదని నిర్ణయించారు.
రోటీన్ కు భిన్నంగా విభిన్నమైన రీతిలో వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా గొడవ పడి.. పట్టుబడిన యువకుల తల్లిదండ్రుల్ని పిలిపించారు. గంజాయికి బానిస అయి.. ఆ మత్తులో వారు చేస్తున్న తప్పుడు పనుల్ని చెప్పారు. అనంతరం వారి చేతికి లాఠీలు ఇచ్చి పిల్లల్ని దండించాలని సూచించారు. తమ బిడ్డల్ని తాము కొట్టేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు. గంజాయి మత్తులో ఇంత రచ్చ చేస్తున్నా.. ఇలానే స్పందించేదా? అంటూ వారిని వెయిట్ చేయాలని చెబుతూ.. పోలీసులు ఎలా దండిస్తారో చూడండంటూ లాఠీలకు పని చెప్పారు.
గంజాయి మత్తులో పడిన వారి విషయంలో ఈ తరహాలో స్పందిస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. కేసులు పెట్టి.. శిక్షలు వేయటం ద్వారా వారి ఫ్యూచర్ ను చెడగొట్టే కన్నా.. వినూత్నతరహాలో కౌన్సెలింగ్.. వారి జీవితాల్లో మార్పునకు కారణమవుతుందని భావిస్తున్నారు. ఈ తీరును మిగిలిన వారు కూడా ఫాలో అయితే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిల్లల ఘన కార్యం గురించి తల్లిదండ్రులకు తెలిస్తే.. వారిని కంట్రోల్ చేసే బాధ్యతను తీసుకునే వీలుంటుందన్న మాట వినిపిస్తోంది.