రూ.30 లక్షల బంగారు ఆభరణాల్ని మర్చిపోతే ఒంగోలు ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే?
విజయవాడకు చెందిన సుబ్బారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలుకు వచ్చారు.;
స్నేహభావం తగ్గి.. ద్వేషం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. అనూహ్య రీతిలో జరిగిన రెండు ఉదంతాలు.. ఆ రెండు కూడా ఒకే ప్రాంతానికి చెందినవి కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు మనుషుల్ని మతాలు..కులాలు.. ప్రాంతాల వారీగా వర్గీకరించే కన్నా.. మంచోళ్లు.. చెడ్డోళ్లు అని విభజిస్తేనే మంచిదన్న భావన కలుగక మానదు. ఒంగోలుకు చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ప్రదర్శించిన నిజాయితీకి ఫిదా కావాల్సిందే. ఇటీవల తన ఆటోలో ప్రయాణించిన ప్రయాణికులు బ్యాగ్ మర్చిపోవటం.. అందులో ఆరు సవర్ల బంగారు ఆభరణాల్ని గుర్తించిన ఆటోడ్రైవర్ షేక్ ఖలీల్ ఉదంతం ఒకటైతే.. తాజాగా అదే ఒంగోలుకు చెందిన మరో ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు ఏకంగా తన ఆటోలో మర్చిపోయిన రూ.30 లక్షల బంగారు ఆభరణాల బ్యాగ్ ను పోలీసులకు అందజేసిన తీరుకు ఫిదా కావాల్సిందే.
విజయవాడకు చెందిన సుబ్బారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలుకు వచ్చారు. ఆటోలో ప్రయాణించిన అనంతరం తమతో తెచ్చుకున్న ఆభరణాల బ్యాగ్ ను మర్చిపోయి తమ గమ్యస్థానం వద్ద దిగేశారు. ఆటో వెళ్లిపోయిన తర్వాత రూ.30 లక్షలు విలువైన బంగారు నగల్ని తాము ఆటోలో వదిలేసిన వైనాన్ని గుర్తించి.. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు మరో కస్టమర్ ను ఆటో ఎక్కించుకునే క్రమంలో.. అంతకు ముందు తన ఆటోలో ప్రయాణించిన వారు బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని గుర్తించాడు. అందులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల ఉండటంతో.. నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్యాగును అందజేశారు. అప్పటికే బ్యాగ్ మిస్సింగ్ పై కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు గురించి అవగాహన ఉన్న సీఐ నాగరాజు.. బ్యాగును బాధితుడికి అప్పజెప్పారు. అందులో ఆభరణాలు అన్నీ ఉన్న విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చిన పోలీసులు అతని నిజాయితీని కొనియాడారు. ఇలా.. వేర్వేరు ఘటనల్లో ఒంగోలు ఆటో డ్రైవర్లు ఖలీల్.. నాగేశ్వరరావులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిజాయితీ అన్నది మతాలు.. కులాలు.. ప్రాంతాలకు అతీతమైందన్న విషయం మరోసారి ఈ రెండు ఉదంతాలతో రుజువైందని చెప్పాలి.