మిచెల్ తో విడాకులు..బరాక్ ఒబామా స్పందన వైరల్!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తమ విడాకుల పుకార్లకు హాస్యభరిత రీతిలో తెరదించారు.;
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తమ విడాకుల పుకార్లకు హాస్యభరిత రీతిలో తెరదించారు. మిషెల్ ఒబామా కొత్త పాడ్‌కాస్ట్ “IMO with Michelle Obama and Craig Robinson” లో ఈ జంట సరదాగా, ఉల్లాసంగా కనిపించింది. "ఆమె మళ్ళీ నన్ను అంగీకరించింది!" అంటూ నవ్వుతూ అన్నారు బరాక్ ఒబామా. "కొంత కాలం ఇది టచ్ అండ్ గో పరిస్థితిలా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవలి నెలల్లో ఒబామా దంపతుల వివాహబంధంపై అనేక వదంతులు వ్యాపించాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు మిషెల్ ఒబామా హాజరుకాకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ సందర్భంగా మిషెల్ అన్నయ్య క్రెయిగ్ రాబిన్సన్ "ఇద్దరూ ఒకే గదిలో ఉండటం చాలా ఆనందంగా ఉంది" అని వ్యాఖ్యానించగా దానికి మిషెల్ స్పందిస్తూ "అవును, ఎందుకంటే మేము కలిసి కనిపించకపోతే, ప్రజలు విడాకులైపోయామని అనుకుంటారు" అని అన్నారు.
ఒక ఆసక్తికర సంఘటనను రాబిన్సన్ గుర్తు చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ వచ్చి మిషెల్‌ని చూసి "ఏం చేశాడు?" అని అడిగిందట. దీనికి బరాక్ స్పందిస్తూ "ఇలా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎవరో చెబితేనేగానీ తెలుస్తుంది" అని చమత్కరించారు.
ఈ సందర్భంగా మిషెల్ స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు: "నా భర్తను వదిలిపెట్టాలన్న ఆలోచన ఒక్కసారైనా నా మనసులోకి రాలేదు. మేము కష్టకాలాలను ఎదుర్కొన్నాం, మంచి రోజులను ఆస్వాదించాం. నాకు ఎంతో సంతోషం కలిగే అనుభవాలు కూడా కలిశాయి. నా భర్త వల్లే నేను మంచి వ్యక్తిగా మారాను." అని ఆమె విడాకుల రూమర్లకు తెరదించింది.
అలాగే, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరు కావడంపై వచ్చిన విమర్శలపైనా ఆమె స్పందించారు. "ఆ నిర్ణయం నాకు అనుకూలంగా ఉండేలా తీసుకున్నాను. కానీ ప్రజలు అది విడాకుల సంకేతంగా భావించారు," అని ఆమె వివరించారు.
ఒబామా దంపతులు 1992లో వివాహం చేసుకున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో వారి బంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.