తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేలోకి మాజీ సీఎం
అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం డీఎంకే గూటికి చేరారు.;
అసెంబ్లీ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం డీఎంకే గూటికి చేరారు. ఆయనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రియ శిష్యుడిగా పన్నీరు సెల్వం గుర్తింపు తెచ్చుకున్నారు. జయలలిత సీఎం పీఠానికి దూరం కావాల్సిన సమయంలో తన బాధ్యతలను పన్నీరు సెల్వంకి అప్పగించేవారు. జయలలితకు అత్యంత విధేయుడైన పన్నీరు సెల్వం ఆమె మరణాంతరం సీఎం పదవికి, పార్టీకి దూరం కావాల్సివచ్చింది. ఇక నాలుగేళ్ల విరామం తర్వాత పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తమిళనాడుకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం పనిచేశారు. అయితే ఎప్పుడు కూడా ఆయన పూర్తిస్థాయిలో పదవీకాలాన్ని అనుభవించలేకపోయారు. మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పన్నీరు సెల్వం మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటుతో రాజీనామా చేయాల్సివచ్చింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత అన్నా డీఎంకేలో పన్నీరు సెల్వం వర్గం ఇమడలేకపోయింది. పళనిస్వామి వర్గంతో తీవ్ర విభేదాలు కారణంగా మాజీ సీఎం పన్నీరుసెల్వంపై బహిష్కరణ వేటు వేశారు.
ఇక నాలుగేళ్లపాటు రాజకీయంగా సైలెంట్ అయిపోయిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు డీఎంకేలో చేరారు. డీఎంకేకు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగిన పన్నీరు సెల్వం ఆ పార్టీ కండువా కప్పుడు ద్రవిడ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాదిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామం ఎన్నికల్లో డీఎంకేకు లాభించే అంశంగా అంచనా వేస్తున్నారు. పన్నీరు సెల్వంతోపాటు ఆయన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్, అనుచరుడు ఎమ్మెల్యే అయ్యప్పన్ తో కలిసి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన తేనిలోని బోడిమెట్టు నుంచి ఓపీఎస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పన్నీరు సెల్వం తన 18వ ఏట 1969లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 1972లో ఎం.జి. రామచంద్రన్ నాయకత్వంలో డీఎంకేతో విభేదించారు. డీఎంకేకి పోటీగా స్థాపించిన అన్నా డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో పన్నీరు సెల్వం ఒకరు. అన్నా డీఎంకే కోఆర్డినేటర్, ట్రెజరర్ వంటి పదవుల్లో ఆయన పనిచేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా రికార్డు స్థాయిలో 11 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక జయలలిత కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు 2001లో ఒకసారి 2014లో రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2016లో జయ మరణానంతరం కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
జయలలిత మరణం తర్వాత పళనిస్వామి (EPS) తో ఏర్పడిన నాయకత్వ పోరులో భాగంగా, పార్టీలో 'ద్వంద్వ నాయకత్వం' (కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్)గా పన్నీరు సెల్వం కొంతకాలం పనిచేశారు. అయితే ఈపీఎస్ తో నాయకత్వం పంచుకోలేక పన్నీరు సెల్వం తీవ్రంగా విభేదించారు. పార్టీలో ఈపీఎస్ వర్గానిదే పైచేయి కావడంతో పన్నీరు సెల్వంను 2022లో పార్టీ నుంచి బహిష్కరించారు. తేవర్ సామాజిక వర్గానికి చెందిన పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం వల్ల సాంప్రదాయకంగా ఏఐడీఎంకే ఓటు బ్యాంకుగా ఉంటున్న ఆ సామాజికవర్గంపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణ తమిళనాడులోని తేని, మదురై, దిండిగల్, రామనాథపురం వంటి జిల్లాల్లో పన్నీరు సెల్వంకి గట్టి పట్టు ఉంది. ఈ ప్రాంతాల్లో ఆయన లేని లోటు ఏఐడీఎంకేకి నష్టం చేస్తుందని అంచనా వేస్తున్నారు.