ట్రంప్ విమర్శలతో హాట్ టాపిక్ అయిన భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ

అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పేరు హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2025-06-26 07:58 GMT

అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ పేరు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ మేయర్ రేసులో డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీలో అద్భుత విజయం సాధించిన మమ్దానీ, మేయర్ పదవికి అత్యంత చేరువలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తవడంతో ఆయన మేయర్ కావటం ఇక లాంఛనమేనని భావిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "100 శాతం కమ్యూనిస్ట్ పిచ్చివాడు" అంటూ ట్రంప్ మండిపడ్డారు. "డెమోక్రాట్లు హద్దులు దాటి పోయారు. మమ్దానీ మేయర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది భయంకరమైన స్థితి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంతటితో ఆగకుండా ట్రంప్ మమ్దానీ గాత్రం దురదృష్టకరమని, ఆయన తెలివితక్కువ వ్యక్తి అని ‘AOC ప్లస్ 3’ అనే పేరుతో కొందరు ప్రజాప్రతినిధులు మద్దతిస్తున్నారని ఎద్దేవా చేశారు. "మరోవైపు గొప్ప నాయకుడిగా చెప్పుకునే పాలస్తీనియన్ సెనేటర్ చక్ షూమర్ కూడా మమ్దానీకి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు" అని ట్రంప్ విమర్శించారు.

ఇటీవలి కాలంలో ఒక అధ్యక్షుడు ఓ మేయర్ అభ్యర్థిపై ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ వ్యాఖ్యలు ఒక్కసారి కాకుండా చాలా తీవ్రంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మమ్దానీ స్పందించాల్సి ఉన్నా, ఆయన ఇప్పటివరకు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించలేదు. అయితే ఆయన మేయర్‌గా బాధ్యతలు చేపడితే న్యూయార్క్ చరిత్రలో భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు.

మొత్తానికి ట్రంప్ అసహనం స్పష్టంగా కనిపిస్తుండగా... మమ్దానీ విజయం మాత్రం కొత్త యుగానికి నాంది పలుకుతోందని అనేవారూ ఉన్నారు. అమెరికాలో వలసదారుల రాజకీయ చైతన్యం మరింత బలపడుతోందని విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    

Similar News