హైదరాబాద్ నడిబొడ్డున 'అన్నగారి' విగ్రహం.. టీడీపీ ఓటర్లే టర్గెట్ గా రేవంత్ రెడ్డి 'మాస్టర్ స్ట్రోక్'?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తాను మాట ఇచ్చినట్లు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు

Update: 2026-05-18 09:38 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా తాను మాట ఇచ్చినట్లు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేట చౌరస్తాలో తెలుగువారి అన్న ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. సెటిలర్లు, టీడీపీ సానుభూతిపరులు, ఎన్టీఆర్ అభిమానుల ఓట్లే టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. తెలంగాణ గడ్డపై టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందనే అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అమీర్‌పేట్ లోనే కాకుండా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలో ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ’ వంద అడుగుల విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, దివంగత నేత నందమూరి తారక రామారావు (NTR) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఒక ఎమోషన్. పార్టీలకు అతీతంగా అన్నగారిని ఆరాధించే కోట్లాది మంది అభిమానులు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఆయన స్థాపించిన టీడీపీకి అనుకూలంగా ఉంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ఉనికి కోల్పోగా, ఆ పార్టీ సానుభూతిపరులు, అభిమానులు మాత్రం తరచూ తమ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భారీగా ఉండే టీడీపీ సానుభూతిపరులను ఆకర్షించడానికి తెలంగాణ పార్టీలు విస్తృతంగా ప్రయత్నిస్తుంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ విషయమై పెద్ద డిబేట్ కూడా కొనసాగింది. ఆ సమయంలో కీలకమైన టీడీపీ సానుభూతిపరుల ఓటర్లను కైవసం చేసుకోడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అమీర్‌పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇక ఎన్నికల ప్రచార సమయంలో అమీర్‌పేట్ జంక్షన్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ప్రస్తుతం పనులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు పనులు తాజాగా ప్రారంభించారు. ప్రస్తుతం పునాది పనులను ప్రారంభించారని ఇది పూర్తయిన వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి అవిష్కరిస్తారని అంటున్నారు. హైదరాబాద్‌లో అమీర్‌పేట్, మైత్రీవనం ప్రాంతాలంటే నిత్యం లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రజలతో కిటకిటలాడే అత్యంత కీలకమైన జంక్షన్లు. అలాంటి చోట ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయ అడుగులు ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ పార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రణాళికలో భాగంగా పకడ్బందీగా వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ తిరిగి బలపడటం సాధ్యం కాదని, టీడీపీ ఓటర్లు తన నాయకత్వం కిందకు రావాలని బలమైన సంకేతాలు పంపేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహం అమలులో భాగంగా అమీర్‌పేట్ లో విగ్రహం ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతున్నాయని, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ’ ప్రతిపాదించిన 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News