అమీర్ పేటలో ఎన్టీవోడి విగ్రహ ఏర్పాటు హామీని కంప్లీట్ చేసిన సీఎం రేవంత్!
హామీ ఇవ్వటం వేరు.. దాన్ని ఆచరణలో చేపట్టటం వేరు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మాటల్లో చూపినట్లే.. చేతల్లోనూ వేగాన్ని ప్రదర్శించారని చెప్పాలి.
ఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ లోని అమీర్ పేట చౌరస్తా ఈ రోజు వేదిక కానుంది. ఓవైపు బక్రీద్ వేడుకలు.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాను సీఎం హోదాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అమీర్ పేట చౌరస్తాలో నటసార్వభౌమ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం.. సీఎం హామీకి తగ్గట్లే ఆర్నెల్ల వ్యవధిలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్ పేట చౌరస్తాలో ఏర్పాటు చేయటమే కాదు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న పరిస్థితి.
హామీ ఇవ్వటం వేరు.. దాన్ని ఆచరణలో చేపట్టటం వేరు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మాటల్లో చూపినట్లే.. చేతల్లోనూ వేగాన్ని ప్రదర్శించారని చెప్పాలి. గత ఏడాది అక్టోబరు 26-27 తేదీల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వెంగళరావు నగర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ హామీని ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటే.. హామీ అమలు విషయంలో సీఎం రేవంత్ కమిట్ మెంట్ ఇట్టే అర్థమవుతుంది.
‘‘అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు, అందరం 'అన్న' అని అభిమానంగా పిలుచుకునే నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించే బాధ్యతను నేను నవీన్ యాదవ్‌కు అప్పజెబుతున్నా. గత ప్రభుత్వం కావాలనే ఇక్కడ అన్నగారి విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుపడింది. కానీ మన ప్రభుత్వం వచ్చాక, ఇక్కడ బరాబర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. నేనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా’’ అని వ్యాఖ్యానించిన రేవంత్.. అందుకు తగ్గట్లే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజున అమీర్ పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తేదీని.. ఈ రోజు డేట్ ను చూస్తే.. సరిగ్గా ఆర్నెల్ల వ్యవధిలో హామీని అమల్లోకి తీసుకురావటం కనిపిస్తుంది. నిజానికి ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వంలో పలువురు ప్రయత్నాలు చేశారు.కానీ.. అప్పట్లో ట్రాఫిక్ సమస్యలు.. జీహెచ్ఎంసీ నిబంధనల్ని చూపించి నాటి ప్రభుత్వం అనుమతులను తిరస్కరించిందన్న విమర్శ ఉంది. అందుకు చెక్ పెట్టేలా.. సీఎం హోదాలో తాను ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఈ రోజు ప్రారంభిస్తున్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం 13 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డాక్టర్ రాజ్ కుమార్ వడియార్ రూపొందించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో మరికొన్ని చోట్ల కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లుగా చెబుతున్నారు.