అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి!
ఈ క్రమంలో తాజాగా నార్త్ కరోలినాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.;
వీకెండ్ వచ్చిందంటే ఆమెరికాలోని పలు రెస్టారెంట్లు, పబ్ లలో కాల్పుల కలకలం అనే సంఘటనలు గతంలో కొన్ని రోజులు ఆగినట్లు కనిపించినా.. గత కొన్ని రోజులుగా వరుసగా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నార్త్ కరోలినాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
అవును.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇందులో భాగంగా... అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని బోటు నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ లో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ వద్దకు వచ్చింది. ఆ సమయంలో బోటులోని వ్యక్తి ఒక్కసారిగా రెస్టారెంట్ పైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ఇలా తుపాకీతో విరుచుకుపడిన అనంతరం దుండగుడు తిరిగి అదే బోటులో పారిపోయాడు. అతడి కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే.. ఈ దాడికి గల కారణాలు తెలియలేదని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.