ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టు షాక్‌!

మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయపద్రకు షాక్‌ తగిలింది. ఆమెకు ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది

Update: 2023-10-17 05:25 GMT

మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయపద్రకు షాక్‌ తగిలింది. ఆమెకు ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. ఈ మేరకు రాంపూర్‌ లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోర్టు జయప్రదకు షాకిచ్చింది.

2019 లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమెపై స్వార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ కేసు నమోదైంది. విచారణకు స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆమె రాలేదు. దీంతో న్యాయమూర్తి... జయప్రదకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. తదుపరి విచారణ అక్టోబర్‌ 21వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి శోభిత్‌ బన్సల్‌ తీర్పు ఇచ్చారు.

2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంపూర్‌ నుంచి జయప్రద ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలిచిన జయప్రద ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. రాంపూర్‌ లో ఆజంఖాన్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

కాగా 1996 టీడీపీ అనుబంధ విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా జయప్రద పనిచేశారు. అంతేకాకుండా 36 ఏళ్ల వయసులోనే టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా సైతం పనిచేశారు. ఆ తర్వాత ఆమె సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. నాటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ తో సన్నిహితంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ లోని రాంపూర్‌ నుంచి వరుసగా రెండుసార్లు 2004, 2009ల్లో ఎంపీగా సమాజ్‌ వాదీ పార్టీ నుంచి జయప్రద గెలుపొందారు.

Read more!

ఆ తర్వాత సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్, రాంపూర్‌ సమాజ్‌ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ తో వచ్చిన విభేదాలతో సమాజ్‌ వాదీ పార్టీకి రాజీనామా చేశారు. అమర్‌ సింగ్‌ తో కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీని రాష్ట్రీయ లోక్‌దళ్‌ లో విలీనం చేశారు. ఆర్‌ఎల్‌డీ తరఫున ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి జయప్రద ఓడిపోయారు.

తర్వాత అమర్‌ సింగ్‌ కన్నుమూయడంతో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్‌ నుంచి పోటీ చేసి ఆజమ్‌ ఖాన్‌ చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

Tags:    

Similar News