నితీష్ విచిత్ర ప్రవర్తన...ఈసారి పూలకుండీతో !

ఇంతకీ నితీష్ కి ఏమైంది అన్నదే అంతటా చర్చగా ఉంది. ఇదిలా ఉంటే సోమవారం పాట్నాలో జరిగిన ఒక సమావేశంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.;

Update: 2025-05-27 02:45 GMT

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏడున్నర పదుల వయసు కలిగిన వారు. రాజకీయంగా చూస్తే అయిదు దశాబ్దాల అనుభవం ఉన్న నేత. ఆయన బీహార్ లో అత్యధికాలం పనిచేసిన సీఎం గా కూడా రికార్డు సృష్టించారు. నిజాయితీపరుడిగా అవినీతి మరక అంటని నేతగా నితీష్ కుమార్ కి ఎంతో పేరు ఉంది. అయితే నితీష్ కుమార్ ఇటీవల కాలంలో బహిరంగ సభలలో వేదికల మీద విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.అని విపక్షాలు అంటున్నాయి.

దాంతో అది విపక్షాలకు ఒక అస్త్రంగా మారుతోంది. నితీష్ మానసికంగా అలసిపోయారు అని ఆయన సీఎం గా పూర్తి సామర్ధ్యంతో పని చేయలేక పోతున్నారు అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలను నితీష్ కుమార్ కి ఒకనాడు సన్నిహితుడుగా పేరు గడించి ఈ రోజున అక్కడ జన సురాజ్ పేరుతో కొత్త పార్టీతో జనంలోకి వస్తున్న రాజకీయ వ్యూహకర్త రాజకీయ పార్టీ అధినేత ప్రశాంత్ కుమార్ మొదట అన్నారు.

ఆ తరువాత చూస్తే బీహార్ లో ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా అంటున్నారు. కాంగ్రెస్ సైతం విమర్శిస్తోంది. ఇంతకీ నితీష్ కి ఏమైంది అన్నదే అంతటా చర్చగా ఉంది. ఇదిలా ఉంటే సోమవారం పాట్నాలో జరిగిన ఒక సమావేశంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.

ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధార్థ పూలకుండీని చేతికి ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. ఆ వెంటనే నితీష్ అదే పూలకుండీని ఆ అధికారి నెత్తిన పెట్టి ఆయనను చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు. దాంతో అవాక్కు అవడం ఆ అధికారి వంతు అయింది. ఆ సభలో ఇది సరదాకు చేసినట్లు అనిపించినా జనాలకు కాస్తా వినోదంగా ఉన్నా ఒక సీనియర్ ముఖ్యమంత్రి సీనియర్ అధికారి నెత్తిన పూలకుండీని పెట్టడం ఏంటి అన్న చర్చకు దారి తీసింది.

నితీష్ గతంలో కూడా ఒక బహిరంగ సభలో జాతీయ గీతం ఆలపిస్తూంటే నవ్వుతూ ఎవరితో పలకరిస్తూ ఉన్నారని కూడా ప్రచారం సాగింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాట్నాకు వచ్చినపుడు కూడా నితీష్ కొంత వింతగా ప్రవర్తించారు అని విపక్షాలు విమర్శించాయి. ఇపుడు ఇదే అంశం మీద మరోసారి తేజస్వి యాదవ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ మధ్య చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని మీదనే ప్రజలు అంతా చర్చించుకుంటున్నారు అని ఆయన అన్నారు.

మొత్తం మీద చూస్తే మరి కొద్ది నెలలలో బీహార్ లో అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలో ఎన్డీయే మరోసారి గెలవాలని చూస్తోంది. ఎన్డీయే సీఎం అభ్యర్ధిగా నితీష్ కుమార్ నే ఉంచాలని జేడీయూ కోరుతున్న నేపధ్యం ఉంది. నితీష్ నే మళ్ళీ జనం ముందు ఉంచి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్న వేళ నితీష్ ఈ విధంగా వ్యవహరించడం విపక్షాలకు ఒక ఆయుధాన్ని అందిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News