మనిషి పసుపు...అందులోనే గెలుపు !

తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కూడా నిమ్మలకు ఎంతో ఇష్టం. ఆయన పొలాల మధ్య రైతులను కలవాలీ అంటే సైకిల్ నే ఎక్కువగా వాడతారు.;

Update: 2025-08-24 17:39 GMT

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకుండా ఇరవై మూడు మంది మంత్రులు ఉన్నారు. ఇందులో టీడీపీకి చెందిన వారు ఇరవై మంది. కానీ విడమరచి చూస్తే ఈ ఇరవై మందిలో ఒకే ఒక్కడుగా ఒకాయన కనిపిస్తారు. ఆయన ప్రత్యేకత వేరు అన్నట్లుగా ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా ఇట్టే చెప్పేయవచ్చు. ఆయన అంతలా ఆకట్టుకుంటారు కూడా. ఇంతకీ ఆయన ఎవరు అంటే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

కేరాఫ్ పాలకొల్లు :

గోదావరి జిల్లాలలో పేరు మోసిన పాలకొల్లు ఆయన చిరునామా. అక్కడ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. వరసగా 2014 నుని 2024 దాకా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. పూర్వాశ్రమంలో లెక్చరర్ గా పనిచేశారు. ప్రతీ విషయం మీద మంచి అవగాహన ఉంది. జనాలకు వివరంగా తెలియచేసే ఓపిక నైపుణ్యం కూడా ఆయనకు ఉంది. నిత్యం జనాలకు అందుబాటులో ఉండడం ఆయనకు ఇష్టం. అదే ఆయన గెలుపు రహస్యం అనుకున్నా తప్పులేదంటారు.

పసుపు చొక్కాతోనే అంతా :

తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ పసుపుని పార్టీ రంగుగా ఎంచుకున్నారు.ఎందుకు అంటే పసుపు అన్నది శుభప్రదం అని చెప్పారు. అలా టీడీపీలో ఎంతమంది పసుపు చొక్కాలు ధరిస్తారో చెప్పలేరు కానీ నిమ్మల మాత్రం పసుపు చొక్కాను విడిచి అసలు ఉండరు. ఆయన మూడు వందల అరవై రోజులూ పసుపు షర్ట్ తోనే దర్శనం ఇస్తారు. అచ్చమైన స్వచ్చమైన తెలుగు తమ్ముడిగా ఆయన పార్టీలో మెరుస్తారు. అందుకే ఆయన అంతలా పాపులర్ కూడా అయ్యారని అంటారు.

అదే అదృష్ట జాతకం :

పసుపు శుభకరమే కాదు, అదృష్టకరం కూడా అని చెబుతారు. దానిని నిత్యం ధరించిన మంత్రి నిమ్మలకు అది నిరంతరం అండగా ఉంటోంది. ఆయన 2014 నుంచి 2019 దాకా అధికార సభ్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 2019 నుంచి 2024 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన వైసీపీ ప్రభుత్వం మీద అసెంబ్లీ లోపలా బయటా భారీ పోరాటమే చేశారు. ఇక 2024 నుంచి మంత్రిగా ఉంటూ తన శాఖలో సమర్ధత చాటుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న ర్యాంకులలో నిమ్మల వారు ఎపుడూ ఫస్ట్ ర్యాంకునే అందుకుంటున్నారు అని అంటున్నారు. ఇక విధేయతలో పట్టుదలలో ఆయనకు సరిసాటి ఆయనే అని చెబుతారు.

సైకిల్ ని వీడని నైజం :

తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కూడా నిమ్మలకు ఎంతో ఇష్టం. ఆయన పొలాల మధ్య రైతులను కలవాలీ అంటే సైకిల్ నే ఎక్కువగా వాడతారు. అలాగే కుగ్రామాలకు సైతం సైకిల్ మీదనే వెళ్తారు కాస్తా దూరం ఎక్కువ అయితే మోటార్ సైకిల్ తీస్తారు. అలా సామాన్యుడిగా ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ పసుపు తనాన్ని అభిమాన ధనాన్ని ఏనాడు వీడని నిమ్మలకు గెలుపు తోడుగానే ఉంటోంది అని అంటారు.

అక్కడా వీడని పసుపు :

ఇటీవల జరిగిన తన కుమార్తె వివాహ నిశ్చితార్ధం వేళ సైతం నిమ్మల పసుపు చొక్కాను వీడలేదు అంటే ఆయన నిబద్ధత పసుపుదనం పట్ల ఆయనకు ఉన్న మక్కువ ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. అందుకే నిమ్మల ప్రత్యేకం. ఆయన రాజకీయ బాణి ప్రత్యేకం. ఆయనను పాలకొల్లులో ఓడించడం కష్టమని ప్రత్యర్ధులు అనుకునేది కూడా ఇవన్నీ చూసే. మొత్తానికి ఈ పసుపు తమ్ముడు నిఖార్సు అయిన టీడీపీ భక్తుడు అని అంతా అంటారు. అదే నిజం కూడానూ.

Tags:    

Similar News