ట్రంప్ కు జ్ఞానోదయం చేసిన హీరో నిఖిల్ సిద్ధార్థ్

ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంతర్గత కారణాలు హాలీవుడ్‌లో చోటు చేసుకున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం ఉండేది.;

Update: 2025-09-30 11:14 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ సహా విదేశాల్లో నిర్మితమయ్యే సినిమాలపై 100 శాతం అదనపు సుంకాలను విధిస్తామన్న ప్రకటనపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న ఆందోళనలకు హీరో నిఖిల్ సిద్దార్థ్ స్పష్టమైన వివరణతో తెరదించారు.

ట్రంప్ ప్రకటన కేవలం "రాజకీయ స్టేట్‌మెంట్" మాత్రమేనని, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఈ టారిఫ్‌లను అమలు చేయడం అసాధ్యం అని నిఖిల్ ధైర్యంగా తెలిపారు. భారతీయ సినిమాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.

నిఖిల్ వివరించిన కీలక చట్టపరమైన అంశాలు:

బర్మన్ సవరణ : IEEPA (International Emergency Economic Powers Act) కింద అమెరికా అధ్యక్షుడు పుస్తకాలు, సినిమాలు, మ్యాగజైన్లు వంటి "సమాచార వనరులపై" ఎటువంటి టారిఫ్‌లు లేదా ఆంక్షలు విధించే అధికారం ఉండదని 50 U.S.C. §1702(b)(3) సెక్షన్ స్పష్టంగా పేర్కొంటుంది.

ఫస్ట్ అమెండ్‌మెంట్ : అమెరికా రాజ్యాంగంలోని ఈ సవరణ ప్రకారం, సినిమాల వంటి సమాచార వనరులపై ఆంక్షలు విధించడం 'మాటల స్వేచ్ఛ'కు విరుద్ధం కాబట్టి అమలు చేయడం అసాధ్యం.

WTO నిబంధనలు: ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఒప్పందాల ప్రకారం కూడా ఇలాంటి టారిఫ్‌లు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధం అవుతాయి.

అమెరికా కోర్టు తీర్పులు: ఇటీవల అమెరికా కోర్టులు కూడా IEEPA ఆధారిత ఇలాంటి సుంకాలను నిలిపివేస్తూ తీర్పులు ఇచ్చాయి.

ఈ చట్టపరమైన అడ్డంకుల కారణంగా, ట్రంప్ ప్రకటన అమలుకు నోచుకోదని, సినీ పరిశ్రమ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిఖిల్ సిద్దార్థ్ ధైర్యం చెప్పారు.

ట్రంప్ ప్రకటనతో ఆందోళన:

ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా, ఇతర దేశాలు అమెరికా చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలిస్తున్నాయంటూ, కాలిఫోర్నియా నష్టపోతోందంటూ ఈ 100 శాతం అదనపు సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాల ప్రభావం వల్ల అమెరికా, కెనడాల్లో భారీగా ప్రదర్శితమయ్యే భారతీయ చిత్రాలకు, ముఖ్యంగా కోట్లాది డాలర్ల వసూళ్లు సాధించే పెద్ద సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్' ద్వారా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. "అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. చిన్న పిల్లాడి నుంచి క్యాండీ లాక్కున్నట్లుగా ఇది ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింటోందని, దీనికి డెమోక్రాట్ గవర్నర్ గవిన్ న్యూసమ్ బలహీనత, పోటీపడలేని తత్వమే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఈ "సుదీర్ఘ సమస్యను" పరిష్కరించేందుకే దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

భారతీయ చిత్రాలపై ప్రభావం: గట్టి దెబ్బే

ట్రంప్ సుంకాల మోతవల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. ఎందుకంటే మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అమెరికా, కెనడాల్లో నివసించే ప్రవాస భారతీయుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. 2017లో 'ఫోర్బ్స్' ఇచ్చిన నివేదిక ప్రకారం, భారతీయ భాషల చిత్రాలు ఈ ప్రాంతంలో భారీగా ప్రదర్శితమవుతున్నాయి. పెద్ద సినిమాలు ఒక్కోటి సగటున $8 మిలియన్ల (80 లక్షల డాలర్ల) వరకూ వసూళ్లు సాధిస్తాయి. కొన్ని సందర్భాల్లో $10 మిలియన్లు (కోటి డాలర్లను) కూడా వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్నా, అమెరికాలోని దాదాపు 1,000 స్క్రీన్లలో భారతీయ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. 100 శాతం అదనపు సుంకాలు విధిస్తే, భారతీయ చిత్రాల ప్రదర్శన వ్యయం, పంపిణీ వ్యయం అమాంతం పెరిగిపోయి, అక్కడి మార్కెట్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.

*కళతప్పుతున్న హాలీవుడ్: ఓటీటీలు, సమ్మెల ప్రభావం

ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని అంతర్గత కారణాలు హాలీవుడ్‌లో చోటు చేసుకున్నాయి. గతంలో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం ఉండేది. అయితే, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ల రాకతో ప్రపంచంలో ఎక్కడ నిర్మించినా సినిమాలు అనువాదమై అన్ని దేశాలకు చేరుతున్నాయి. దీంతో హాలీవుడ్ ఆధిపత్యానికి గండి పడింది. సినిమా హాళ్ల రాబడి తగ్గింది. అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారమవుతుండటంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది. ఫలితంగా హాలీవుడ్‌లో నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2023, 2024లలో రచయితల సంఘం, కార్మిక సంఘాలు చేపట్టిన సుదీర్ఘ సమ్మెల కారణంగా హాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. ఒక్క 2023లోనే దాదాపు $5 బిలియన్ల నష్టం వచ్చినట్లు అంచనా. సమ్మెల వల్ల పోయిన ఉద్యోగాలు ఇంకా పూర్తిగా రాలేదు. ఈ నేపథ్యంలో, అమెరికన్ చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని తిరిగి దేశంలోనే కేంద్రీకరించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ స్పందన, నెట్‌ఫ్లిక్స్ షేర్లు

ట్రంప్ సుంకాల ప్రకటనపై హాలీవుడ్‌లోని ప్రముఖ సంస్థలైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, కామ్‌కాస్ట్, పారామౌంట్ స్కైడ్యాన్స్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు వెంటనే స్పందించలేదు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడ్డాక నెట్‌ఫ్లిక్స్ షేర్లు పడిపోవడం గమనార్హం. ట్రంప్ కేవలం సినిమాలపైనే కాకుండా, అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఫర్నిచర్ వ్యాపారులను కూడా హెచ్చరించారు. ఈ సుంకాల విధానం ప్రపంచ చలనచిత్ర రంగాన్ని, ముఖ్యంగా భారతీయ చిత్రాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

అయితే, నిఖిల్ సిద్దార్థ్ యొక్క చట్టపరమైన వివరణ ఈ భయాందోళనలకు తెరదించి, భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది. "భారత సినిమాలపై ఎటువంటి ఆంక్షలు రావు. చట్టపరంగా ఇది సాధ్యం కాని విషయం. అందుకే సినీ పరిశ్రమలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని నిఖిల్ సిద్దార్థ్ ధైర్యం ఇచ్చారు.

Tags:    

Similar News