గోవా నైట్ క్లబ్ లో ఊహకందని విషాదం.. 23 మంది మృతి.. ప్రమాదానికి కారణమదే?
ఈ ప్రమాదంలో మరణించిన ఎక్కువ మంది మృతదేహాలను గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగది ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నందున సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తేలింది.;
విందులు, వినోదాలతో ఎప్పుడూ స్వర్గంగా కనిపించే గోవాలో ఊహకందని విషాదం నెలకొంది. పార్టీలు, పబ్బులకు ఫేమస్ అయిన ఈ ప్రాంతం గత రాత్రి విషాదంలో మునిగిపోయింది. గోవాలోని నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదంలో 23 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది.
ఉత్తరగోవాలోని బాగా బీచ్ సమీపంలో ఉన్న అర్బోరాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం 23 మంది మరణించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సిలిండర్ పేలుడు కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆదివారం తెల్లవారుజాము వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. ఈ ప్రమాంలో గాయపడి వారిని ఆస్పత్రులకు తరలించారు. సోషల్ మీడియాలో భవనం నుంచి భారీ మంటలు, దట్టమైన పొగలు వెలువడడం దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఈ ప్రమాదంలో మరణించిన ఎక్కువ మంది మృతదేహాలను గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగది ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నందున సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తేలింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది నైట్ క్లబ్ సిబ్బంది ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మెట్లపై రెండు మృతదేహాలను కనుగొన్నట్టు సమాచారం. ఇక గోవా డీజీపీ అలోక్ కుమార్ సైతం సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని దృవీకరించారు. మరణించిన వారిలో ఎక్కువ క్లబ్ సిబ్బంది అని తెలిపారు.
ఇక ఈ ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాను. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలకు దిగుతామని సీఎం పేర్కొన్నారు.మృతుల్లో ఎక్కువగా వంటగది సిబ్బంది ఉన్నారని.. ముగ్గురు మహిళలు చనిపోయారని ప్రమోద్ సావంత్ తెలిపారు.
గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ తో మాట్లాడిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.