26/11 తరహా కుట్రలు.. ఎర్రకోట పేలుడు కేసు వెనక పెద్ద ఉగ్ర నెట్‌వర్క్
అరెస్టయిన మహిళా వైద్యుల్లో ఒకరికి చెందిన బ్రెజా కారు ప్రస్తుతం దర్యాప్తు కేంద్రంగా మారింది. ఆ కారులో పేలుడు పదార్థాలు దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.;
దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ పేలుడు ఘటన వెనక ఉన్న ఉగ్ర కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముంబయి 26/11 దాడుల తరహాలోనే దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన యోచన బయటపడింది. దిల్లీతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
* 200 ఐఈడీ బాంబులు సిద్ధం చేయాలన్న కుట్ర!
ఎర్రకోట పేలుడు కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు ఆశ్చర్యానికి గురయ్యే సమాచారం వెలికితీశాయి. ఉగ్రవాదులు దాదాపు 200 ఐఈడీ బాంబులు తయారుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని దిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం వంటి ప్రదేశాలతో పాటు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేల్చే ప్లాన్ చేశారు.
దిల్లీ, హరియాణా, జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించగా 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
* ఎర్రకోట పేలుడు..విచారణ వేగం పెరిగింది
ఎర్రకోట వద్ద పేలుడు చోటుచేసుకున్న ప్రదేశం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. ప్రాథమిక విశ్లేషణలో అమ్మోనియం నైట్రేట్‌తో పాటు మరో శక్తివంతమైన పేలుడు పదార్థం ఆనవాళ్లు బయటపడ్డాయి.
దిల్లీ పేలుడు కేసును ఎన్‌ఐఏ (NIA) దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్, దిల్లీ, హరియాణా పోలీసుల కేసు రికార్డులను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు లభించిన ఆర్థిక సహాయం, విదేశీ మద్దతు గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు.
* ఫరీదాబాద్ మాడ్యూల్.. తుర్కియే లింక్‌లు బయటపడ్డాయి!
ఈ దాడుల వెనక ఉన్న ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు తుర్కియేతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో కీలక పాత్రధారులుగా ఉన్న డాక్టర్ ఆదిల్, ముజమ్మిల్ ఈ ఏడాది ప్రారంభంలో తుర్కియే పర్యటన చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అక్కడి హ్యాండ్లర్లే వారి బస ఏర్పాట్లు, సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరు విదేశీ హ్యాండ్లర్లతో కలసి కుట్రలు పన్ని, దానికి కావలసిన ఆర్థిక మద్దతును డిజిటల్ వాలెట్ల ద్వారా ఇస్తాంబుల్, దోహా నుంచి పొందినట్లు ఆధారాలు లభించాయి. ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకే వినియోగించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
* బ్రెజా కారు మిస్టరీ.. పేలుడు పదార్థాల అనుమానం
అరెస్టయిన మహిళా వైద్యుల్లో ఒకరికి చెందిన బ్రెజా కారు ప్రస్తుతం దర్యాప్తు కేంద్రంగా మారింది. ఆ కారులో పేలుడు పదార్థాలు దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అధికారులు ఆ వాహనాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మహిళా డాక్టర్ల సోషల్ మీడియా చాట్‌ల్లో కూడా ఉగ్ర కుట్రల ఆధారాలు బయటపడ్డాయి. నిధుల బదిలీలు, లాజిస్టిక్స్, సురక్షిత ప్రదేశాలపై చర్చలు జరిగినట్లు గుర్తించారు. ఇద్దరు మహిళా డాక్టర్లు బంగ్లాదేశ్‌లోని ఢాకా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, శ్రీనగర్‌లో ఇంటర్న్‌షిప్ సమయంలో మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్ ప్రభావంతో ఉగ్రవాద భావజాలం వైపు మళ్లినట్లు సమాచారం.
* దేశ భద్రతకు సవాలు.. మరిన్ని అరెస్టులు
ఎర్రకోట పేలుడు ఘటన వెనక ఉన్న ఈ ఉగ్ర నెట్‌వర్క్ దేశ భద్రతా వ్యవస్థను గందరగోళానికి గురి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. తుర్కియే, పాకిస్థాన్ ఆధారిత జైషే మహ్మద్ ముఠా ఈ కుట్ర వెనక ఉన్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.
ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హై అలర్ట్‌లో ఉన్నాయి. మరికొన్ని రోజులలో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఎర్రకోట పేలుడు కేసు ఒక సాధారణ ఘటన కాదని, దేశ భద్రతను కుదిపేయాలన్న పెద్ద ఉగ్ర కుట్రలో భాగమని ఇప్పుడు స్పష్టమవుతోంది. 26/11 తరహా దాడులను పునరావృతం చేయాలన్న ప్రయత్నాలను భారత భద్రతా బలగాలు సమయానికి అడ్డుకోవడం దేశాన్ని మరో పెద్ద విపత్తు నుంచి రక్షించినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.