జాతీయ సంస్థను టార్గెట్ చేసిన బాబు...రేవంత్ ఓకేనా ?

అంతే కాదు పరిచయాలు సాన్నిహిత్యాలు వేరు రాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని కూడా చెప్పుకుని వస్తున్నారు.;

Update: 2025-07-06 19:30 GMT
జాతీయ సంస్థను టార్గెట్ చేసిన బాబు...రేవంత్ ఓకేనా ?

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రల మధ్య పెట్టాల్సిన రాజకీయం పెడుతున్నారు. అంతే కాదు ఒకనాడు రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేశారు అన్న కారణంతో ఆయన చంద్రబాబు శిష్యుడు అని బీఆర్ ఎస్ నేతలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు చూస్తే తెలంగాణా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి ఈ రకమైన ప్రచారం సవాల్ గా మారుతోంది. తనను తాను ఎప్పటికపుడు నిరూపించుకునే ప్రయత్నంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.

అంతే కాదు పరిచయాలు సాన్నిహిత్యాలు వేరు రాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని కూడా చెప్పుకుని వస్తున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు సహచరుడిని తప్ప గురువు శిష్యుల బంధం లేదని కూడా చెబుతున్నారు. ఇలాంటి మాటలు అనవద్దు అని కూడా ఖండితంగా చెబుతున్నారు.

అయితే ఎంతలా ఆయన చెప్పినా బీఆర్ఎస్ మాత్రం ఏపీ సెంటిమెంట్ నే వ్యూహంగా చేసుకుని రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య బంధం ఉందని చెప్పేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో చూస్తే కనుక ఏపీ నుంచి మరో కఠిన పరీక్ష రేవంత్ రెడ్డికి ఎదురు కాబోతోంది అన్న చర్చ నడుస్తోంది.

తాజాగా చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణాలో కేంద్రీకృతం అయిన ఒక జాతీయ సంస్థను ఏపీకి తరలించాలని కేంద్రానికి లేఖ రాశారు. జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డీబీ హైదరాబాద్ లో ఉంది. ఉమ్మడి ఏపీలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఇపుడు దాని అవసరం తెలంగాణా కంటే ఏపీకే ఎక్కువగా ఉందని బాబు కేంద్రానికి రాసిన లేఖ చెప్పుకొచ్చారని అంటున్నారు.

ఏపీలో ఏకంగా అతి పెద్ద తీర ప్రాంతం ఉందని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు అక్వా ఉత్పత్తులలో ఏపీదే అగ్ర తాంబూలం అని చెబుతున్నారు. 19 వేల 420 కోట్ల రూపాయలతో దేశంలో ప్రముఖ స్థానంలో ఏపీ ఆక్వా ఉత్పత్తులు ఉన్నాయని బాబు చెబుతున్నారు.

ఇక భౌగోళికంగా చూసినా సుదీర్ఘ తీరం రొయ్యల పరిశ్రమ ఉన్న ఏపీలోనే జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాబు కేంద్రానికి లేఖ రాశారని అంటున్నారు. నిజంగా బాబు కోరినది సమంజసమైనదే. ఏపీలోనే ఆక్వా పరిశ్రమ ఉంది. సముద్ర తీరం ఉన్న చోటనే మత్స్య అభివృద్ధి సంస్థ ఉండడం ఎంతో మేలు అని అంటున్నారు.

కానీ హైదరాబాద్ లో లోకేట్ అయిన ఈ జాతీయ సంథను ఏపీకి తరలించాలి అంటే రాజకీయంగా ఏమైనా విమర్శలు ఎదురవుతాయా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి చూస్తే అలా ఎవరూ అడ్డుకోకూడదు, కానీ ఇప్పటికే క్రిష్ణా రివర్ లో 65 టీఎంసీలను గురు దక్షిణగా రేవంత్ రెడ్డి ఏపీకి చెల్లించుకున్నారని ఆరోపిస్తున్న తెలంగాణావాదులు ఇపుడు ఒక జాతీయ సంస్థను ఏపీకి తరలిస్తోంది అని కూడా ప్రచారం చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అయితే రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. రెండు రాష్ట్రాలు సోదర భావంతో పరస్పరం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కనుక ఆలోచిస్తే మాత్రం కచ్చితంగా ఏపీకి ఈ జాతీయ సంస్థను కేంద్రం అప్పగించాలి. దానికి ఎలాంటి ఇబ్బందులు అవాంతరాలూ లేకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News