టార్గెట్ నెహ్రూ: మోడీకి తొలిసారి మైన‌స్ మార్కులు?

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-12-15 15:30 GMT

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఏ విషయంపై చర్చ జరిగినా నెహ్రూను టార్గెట్గా చేసుకుని మోడీ నిప్పులు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల వందేమాతరం పై చర్చ జరిగినప్పుడు కూడా నెహ్రూను ఆయన టార్గెట్ చేశారు. నెహ్రూ అనుస‌రించిన విధానాల కార‌ణంగానే దేశ‌ విభజన జరిగిందని, దేశం ఈరోజు అధోగతిలో ఉందంటే దానికి కారణం నెహ్రూ తీసుకున్న నిర్ణయాలేన‌ని మోడీ పదేపదే చెబుతున్నారు.

అంతేకాదు నెహ్రూ, ఇందిర‌లు ధ్వంసం చేసిన దేశాన్ని తాము గాడిలో పెడుతున్నామని కూడా మోడీ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అన్ని సందర్భాలలోను ఇటువంటి ప్రచారం ఇటువంటి వ్యాఖ్యలు పనిచేయవు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి రెండు సందర్భాల్లో అయితే అవి నిజమేన‌ని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. కానీ, పదే పదే నెహ్రూను టార్గెట్ చేస్తుండ‌డంతో వాటిపై విశ్వ‌సనీయ‌త స‌న్న‌గిల్లుతోంది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ ఎత్తున నెహ్రూకు సంబంధించి అనేక కథనాలు, వ్యాసాలు, డాక్యుమెంటరీలు పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలోను అటు కొన్ని తటస్థ మీడియా ఛానళ్ల‌లోనూ ప్రసారమవుతున్నాయి.

మరోవైపు మేధావులు కూడా స్పందిస్తున్నారు. నెహ్రూ ఈ దేశానికి ఏం చేశారు? ఆయన వల్ల ఏ ప్రయోజనం కలిగింది? లేదా మోడీ చెబుతున్నట్టుగా నెహ్రూ వల్లే దేశం నాశనం అయిందా? అనే అంశాలపై పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో నాటి ప్రధానిగా నెహ్రూ చేసిన అనేక అంశాలను మేధావులు చెప్పుకొస్తున్నారు. ఈరోజు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కావడానికి, విద్యా వ్యవస్థ, పారిశ్రామికంగా అదేవిధంగా అంతరిక్ష రంగంలోనూ భారతదేశం తన సత్తాను చాటటానికి నెహ్రూ వేసిన పునాదులు కారణమన్నది వారు చెప్పిన మాట.

కొన్ని రాజకీయపరమైన అంశాల్లో నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమే అయినప్పటికీ దేశాన్ని ముందుకు నడిపించడంలోనూ, దార్శ‌నిక‌తను ప్రదర్శించడంలోను నెహ్రూ అత్యంత సమర్థవంతంగా పనిచేశారని మెజారిటీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. నీటిపారుదల రంగాన్ని గాడిలో పెట్టడంతో పాటు బాక్రనంగల్, నాగార్జునసాగర్, హీరాకుడ్ వంటి బలమైన ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా నీటిని ఏ విధంగా ఒడిసి ప‌ట్టారు? వ్యవసాయ రంగాన్ని ఎంత బలోపేతం చేశారని అంశాల‌ను కూడా వివరిస్తున్నారు.

అదే విధంగా దేశంలో 1950లలోనే ఐఐటీలు, ఐఐఎంల‌ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో మేధావులను తీర్చిదిద్దిన అంశాలను కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే భారత అంతరిక్ష రంగాన్ని ఆనాడే బలోపేతం చేసిన విషయాన్ని కూడా ఆధారాల తో సహా బయటపెడుతున్నారు. నిజానికి మోడీ ఈ స్థాయిలో విమర్శలు చేయకపోయినా ఈ స్థాయిలో నెహ్రూను టార్గెట్ చెయ్యకపోయినా ఇప్పుడు అవన్నీ పెద్దగా చర్చకు వచ్చేవి కాదు. మేధావులు స్పందించే వారు కూడా కాదు. కానీ నెహ్రూను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలన్న ప్రధాన ఉద్దేశంతో నరేంద్ర మోడీ చేస్తున్న ఈ వ్యతిరేక వాదన వ్యతిరేక ప్రకటనలు వంటివి రాను రాను ఆయనకు మైనస్ మార్కులు పడేలా చేస్తున్నాయి.

నిజానికి చెప్పాలంటే మోడీకి నెహ్రూను టార్గెట్ చేయడం కొత్త కాకపోయినా ఇప్పుడు చేసిన వాదన దాదాపు వీగిపోయింది అన్నది మేధావులు చెబుతున్న మాట. నెహ్రు రాజకీయంగా కొన్ని పొరపాట్లు చేస్తే చేసి ఉండవచ్చు.. కానీ ఆయనకు ఉన్న ఇమేజ్ కానీ ,దేశంలో ఏర్పాటు చేసిన పంచవర్ష ప్రణాళికలు వంటి ప్రభుత్వాలకు నిర్దేశిత నమూనాలు కానీ ఎప్పటికీ చెరిగిపోవన్నది వారు చెబుతున్న మాట. అయితే పంచ‌వ‌ర్ష ప్రణాళికలను మోడీ హయాంలో తీసివేసి నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు.

ఇంతకుమించి మోడీ హయంలో బలమైన నీటి ప్రాజెక్టులు కానీ బలమైన అంతరిక్ష వ్యవస్థను గాని సృష్టించలేకపోయారు. పైగా వాటిని ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిని కంపేర్ చేస్తూ అటు నెహ్రూ ఇటు మోడీ పాలనలకు ముడి పెడుతూ అనేకమంది మేధావులు చర్చల్లో పలు విషయాలను ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా చూస్తే `టార్గెట్ నెహ్రూ` అన్నది మోడీకి అంతగా కలిసి రావటం లేదన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన చర్చ. ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ ఏం చేశారన్నది చెప్పగలిగితే అప్పుడు నెహ్రూ ను కంపేర్ చేసుకోవచ్చని కూడా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News