యూసుఫ్‌గూడ బస్తీ పిల్లడు..ఎమ్మెల్యే అయిండు..తండ్రి కోరిక తీర్చిండు
నవీన్ యాదవ్ మా స్కూల్లోనే చదివాడు.. చాలా చురుకైనవాడు.. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ స్పోకెన్.. ఉన్నత చదువులు చదివినా కూడా మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవాడు..;
నవీన్ యాదవ్ మా స్కూల్లోనే చదివాడు.. చాలా చురుకైనవాడు.. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ స్పోకెన్.. ఉన్నత చదువులు చదివినా కూడా మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేవాడు.. ఇప్పటికీ అదే గౌరవంతో చూస్తాడు.. మా ప్రాంతంలో మా కళ్ల ముందు పుట్టి పెరిగినవాడు. అతడు ఎమ్మెల్యే అయినాడంటే మాకే కాదు అందరికీ గర్వ కారణంగా ఉంది.
-యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఎంఎం నాయుడు
నవీన్ యాదవ్ ను చిన్నప్పుడు ఆడించిన.. ఎప్పుడూ వాళ్ల ఇంటికెళ్లేటోడిని. పిల్లాడుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మాతో నవీన్ అలాగే ఉన్నడు .
-యూసుఫ్‌గూడ ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర పంక్చర్ షాప్ నడిపే ప్రకాష్ ముదిరాజ్..
ఈ రెండు ఉదాహరణలు చాలు.. స్థానికులకు నవీన్ యాదవ్ తో ఎంత అనుబంధం ఉందో చెప్పేందుకు.. దీంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది.. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా అనుభవం లేని అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికలో.. 41 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తద్వారా కొత్త చరిత్ర లిఖించారు. ఈ టర్మ్ లో మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. వచ్చే టర్మ్ కు మరింత బలమైన నాయకుడిగా పోటీకి నిలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. మొత్తమ్మీద యూసుఫ్‌గూడ బస్తీ పిల్లడు ఎమ్మెల్యే అయిండు. అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండు.
ముచ్చటగా మూడో ప్రయత్నంలో..
2014లోనే నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అవుతాడా? అన్నంత ఊపు వచ్చింది. అప్పట్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన ఆయన ఆ పార్టీ గుర్తు పతంగిని ఎగరేసేలా కనిపించారు. కానీ, చివరివరకు పోరాడినా ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. 41,656 ఓట్లు సాధించారు. 2018లోనూ పోటికి సిద్ధమైనా చివరి నిమిషంలో ఎంఐఎం టికెట్ రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 18,817 ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడోసారి నేరుగా అధికార పార్టీ అభ్యర్థిగా నిలిచిన దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో చిరకాల కోరిక ఎమ్మెల్యే కావడాన్ని నెరవేర్చుకున్నారు.
ఆ ఒక్క నిర్ణయం జీవితాన్ని మలుపుతిప్పింది
2018లో ఎంఐఎం టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి దూరం జరిగారు నవీన్ యాదవ్. ఆ తర్వాత కొంత కాలానికి కాంగ్రెస్ లో చేరారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అప్పటికి దక్కలేదు. పార్టీ నిలిపిన అభ్యర్థి (అజహరుద్దీన్)కి మద్దతుగా ప్రచారం చేసి మంచి మార్కులు పొందారు. పార్టీ ఓడినా నవీన్ కు మైలేజీ వచ్చింది. అనూహ్యంగా గెలిచిన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్) చనిపోవడం ఉప ఎన్నిక రావడం నవీన్ యాదవ్ కు కలిసివచ్చింది. ఎమ్మెల్యేను చేసింది.
తండ్రి కోరిక..
నవీన్ యాదవ్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్. యూసుఫ్ గూడ బస్తీ వేదికగా తన ప్రస్థానం ప్రారంభించారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ అనుచరుడిగా ఉంటూ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి నాయకుడు కావాలనుకున్నారు. కానీ, కేసుల కారణంగా అది నెరవేరలేదు. కానీ, తన పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ ను ఆ మేరకు తీర్చిదిద్దారు. తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకున్న నవీన్ రాజకీయాల్లో ఓపిక పట్టి తండ్రికి గొప్ప బహుమతి ఇచ్చారు.
మా వాడే...
నవీన్ యాదవ్ వయసు చిన్నదే కావొచ్చు. కానీ, అతడు అందరికీ మా వాడు అనుకునేలా చేసింది స్థానికత. యూసూఫ్‌గుడ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆయనను అందరూ ఓన్ చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కంటే నవీన్ ను ఇదే ముందు నిలిపింది. గతంలో రెండుసార్లు ఓడిపోవడంతో మావాడిని ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే చేసుకోవాలన్న పట్టుదల స్థానికుల్లో కనిపించింది. ఇప్పుడదే భారీ ఆధిక్యంతో గెలుపును కట్టబెట్టింది.