జాబిల్లి కోసం ...మళ్ళీ పయనం...

విశ్వం ఎన్ని రహస్యాలను తనలో ఇముడ్చుకుని అడుగడుగునా ఆశ్చర్య పరుస్తున్నా...మనిషి తన అలుపెరగని పోరాటంతో కొత్త కొత్త పరిశోధనలతో విశ్వరహస్యాలను ఛేదించే దిశగా అడుగులేస్తున్నాడు.;

Update: 2026-01-15 16:39 GMT

విశ్వం ఎన్ని రహస్యాలను తనలో ఇముడ్చుకుని అడుగడుగునా ఆశ్చర్య పరుస్తున్నా...మనిషి తన అలుపెరగని పోరాటంతో కొత్త కొత్త పరిశోధనలతో విశ్వరహస్యాలను ఛేదించే దిశగా అడుగులేస్తున్నాడు. దాదాపు 53 ఏళ్ళ కిందట మనిషి గగనతలానికి దూసుకెళ్లి జాబిల్లిని తాకాడు. అదో విశ్వమానవ ఇతిహాసంలో చిరస్థాయిగా నిలిచిపోయే చరిత్ర ...సరిగ్గా 53 ఏళ్ళ తర్వాత మళ్లీ జాబిల్లిని తాకాలని ఆరాటపడుతున్నాడు మానవుడు. 53 ఏళ్ళ తర్వాత వ్యోమగాములు జాబిల్లి చెంతకు వెళ్ళాలని ఉబలాట పడుతున్నారు. అెమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అతి త్వరలో మానవ సహిత మిషన్ నిర్వహించేందుకు సిద్దమైంది. 1972 తర్వాత చందరునివైపు వెళ్ళే మానవ సహిత ప్రయాణం అర్టెమిస్..2 ఫిబ్రవరి 6న ఉండవచ్చని నాసా వెల్లడించింది. ఆర్టెమిస్ 2 ఆధికారిక ప్రయోగ విండో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 దాకా తెరచే ఉంటుంది.

ఈ మిషన్ లో నలుగరు వ్యోమగాములు రీడ్ వైజ్ మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు పది రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమిని చేరుకుంటారు. అర్టెమిస్..2 ప్రయోగం ఎలాపడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించే వీల్లేదు. భూమి...చంద్రుని స్థానాల ఆర్బిటల్ మెకానిక్స్, రాకెట్ పనితీరు, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ పరిసరాల్లోని వాతావరణ పరిస్థితులు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాకే ప్రయోగానికి సమయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ప్రయోగ తేదీ ప్రకటన వెనక ఇంత కసరత్తు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి

అంతరిక్ష ప్రయోగాలకు తొలుత రష్యా శ్రీకారం చుడితే, ఆ తర్వాత అమెరికా పోటీగా చంద్రమండలం పైకి మనిషిని తొలిసారిగా పంపింది. జులై 20, 1969న మానవ జాతి చరిత్రలో ఓ అద్భుతమని చెప్పాలి. అప్పటివరకు భూగోళానికే పరిమితమైన మనిషి తన ప్రస్థానాన్ని మరో ప్రపంచంలో ప్రారంభించి మానవుడే మహనీయుడు అని నిరూపించాడు.. తొలిసారిగా చందమామ ఒడిలో కాలుమోపాడు. అయితే ఈ ప్రయోగం రాత్రికి రాత్రే జరిగింది కానే కాదు. ఎన్నో లక్సల మెదళ్ళ కదలిక...మరెందరో శ్రమజీవుల దైహిక కష్టం...ఇంకెందరిదో ఆశీర్వాద బలంతో జాబల్లిని అందుకోవాలన్న మనిషి కల నెరవేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన అపోలో-11 వ్యోమనౌక ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ , మైకెల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌ను చంద్రుడిపైకి పంపింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలు మోపి రికార్డు సృష్టించగా, 20 నిమిషాల తర్వాత.. అల్డ్రిన్ చంద్రుడిపై కాలు మోపాడు. వీళ్లు దాదాపు 21 గంటలు చంద్ర మండలంపై గడిపారు. ఇది చరిత్ర మరచిపోలేని చరిత్ర.

అయిదు దశాబ్దాలు దాటిన తర్వాత వ్యోమగాములు మరోసారి జాబిల్లిని ముద్దాడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు 2026 ఫిబ్రవరిని అనువైన సమయంగా నిర్ణయించారు. ఫిబ్రవరి 7,8,10,11 బ్యాకప్ లాంచ్ తేదీలుగా నిర్ణయించారు. అనుకోని సందర్భంలో ఒకవేళ ఈ ప్రయోగం సాధ్యపడకపోతే...మార్చి ప్రారంభం లేదా ఏప్రిల్ నెలల్లో ప్రయోగించేందుకు నాసా రంగం సిద్దం చేసింది. ఈ మిషన్ చంద్రుని ఉపరితలంపై ల్యాండింగ్ కాదని తెలుస్తోంది. అర్టెమిస్ ప్రోగ్రామ్ లో తొలి మూన్ ల్యాండింగ్ ను అర్టెమిస్ 3 ద్వారా నిర్వహించనుండగా అది 2027లో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫిబ్రవరి 6న వ్యోమగాములు కేప్ కానవెరల్ నుంచి ఓరియన్ అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు. నాసా రూపొందించిన శక్తిమంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ఈ నౌకను అంతరిక్షం దాకా తీసుకెళుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు తలెత్తితే భూమిపై సురక్షితంగా వచ్చే వీలు కూడా కల్పించారు. ప్రారంభంలో వ్యోమగాములు లూనార్ ఫ్లైబై ప్రయాణం చేస్తారు. అంటే భూమి చుట్టూ కొన్ని సార్లు తిరిగి, అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా అని పరీక్షించుకుంటారు. చంద్రుణ్ని చేరుకున్నాక ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ ద్వారా నౌక తిరిగి భూమిని చేరుకుంటుంది.

ఈ చారిత్రక ఘట్టం తొలి దశగా చేపట్టే రోలౌట్ కార్యక్రమం జనవరి 17న ప్రారంభం కానుంది. పూర్తిగా అమర్చిన రాకెట్, ఒరియన్ నౌకలను నాసా వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ నుంచి కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ 39Bకి తరలిస్తారు. సుమారు నాలుగు మైళ్ల దూరం ఉన్న ఈ ప్రయాణాన్ని భారీ క్రాలర్-ట్రాన్స్‌పోర్టర్ ద్వారా నిర్వహిస్తారు. దీనికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అనంతరం వ్యోమగాములు ఫ్లైట్ వాక్‌త్రూ ప్రారంభిస్తారు. ఆర్టెమిస్-2 లాంచ్ ప్యాడ్‌పై సిద్ధమైన తర్వాత వెట్ డ్రస్ రిహార్సల్, ట్యాంకింగ్ ప్రక్రియలను నాసా సిబ్బంది చేపడతారు. మొత్తమ్మీద 53 ఏళ్ళ తర్వాత మళ్లీ నాసా చేపడుతున్న ఈ ప్రయోగం ఫలించి మనిషి జాబిల్లిని మరోసారి తాకి రావాలని కోరుకుందాం.

Tags:    

Similar News