శ్యామా ప్రసాద్ ముఖర్జీ గడ్డ మీద మెరిసిన కాషాయం !
ఎవరీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలిసిన పేరే. మరీ ముఖ్యంగా బీజేపీ రాజకీయాలను అవగాహన చేసుకున్న వారికి ఆయన ఏమిటో పూర్తిగా తెలుస్తుంది.;
ఎవరీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలిసిన పేరే. మరీ ముఖ్యంగా బీజేపీ రాజకీయాలను అవగాహన చేసుకున్న వారికి ఆయన ఏమిటో పూర్తిగా తెలుస్తుంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బీజేపీ పుట్టుకకు మూలం. ఆయనే కాషాయం పార్టీ సృష్టికర్త. కుడి పక్ష రాజకీయం దేశంలో ఉండాలని దేశంలో అధిక సంఖ్యాకులు అయిన హిందువుల కోసం ఒక పార్టీ ఉండాలని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అపరిమిత బలంతో వెలిగిపోతున్న కాలంలో తొడగొట్టి మరీ కొత్త పార్టీని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దాని పేరే జన సంఘ్. పశ్చిమ బెంగాల్ కి చెందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ మెదడులో పుట్టిన ఆలోచనకు రూపమే జన సంఘ్. 1951 అక్టోబర్ 21న పురుడు పోసుకున్న జన సంఘ్ నుంచి 1952 తొలి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ నుంచి లోక్ సభకు నెగ్గిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలమైన పునాదులు బెంగాల్ లో నాడే వేశారు. కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి మాత్రం ఏకంగా 75 ఏళ్లకు పైగానే పట్టింది.
బెంగాల్ మొత్తం ప్రభావం :
శ్యామా ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ లో కీలకమైన అగ్ర శ్రేణి నాయకుడు. న్యాయవాదిగా కోక్ కటా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన ఆయన తొలుత భారత జాతీయ కాంగ్రెసు తరఫున బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు. మరుసటి సంవత్సరంలో బెంగాల్ శాసనసభను బహిష్కరించాలని భారతీయ జాతీయ కాంగ్రెసు నిర్ణయించడంతో ఆ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1941-42 లో బెంగాల్ ప్రావిన్స్ మొదటి ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. ఇక స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో కేంద్ర పరిశ్రమల మంత్రిగా పనిచేశారు కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తన కేంద్ర మంత్రి పదవికి ఆయన 1949లో రాజీనామా చేశారు. ఆ మీదటనే జన సంఘ్ కి శ్రీకారం చుట్టారు.
మోడీ సాధించారు :
ఇక శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారసుడిగా జన సంఘ్ లో ఆనక బీజేపీలో ఎదిగిన అగ్ర శ్రేణి నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి ఆరున్నరేళ్ల పాటు ప్రధానిగా పనిచేసినా పశ్చిమ బెంగాల్ లో అయితే బీజేపీకి తగినంత రాజకీయ ప్రాభవాన్ని కలిగించలేక పోయారు అని చెప్పాలి. అయితే మమతా బెనర్జీ తృణమూల్ తో పొత్తు పెట్టుకుని బీజేపీకి ఓట్ల సీట్ల శాతాన్ని నెమ్మదిగా పెంచడంలో మాత్రం వాజ్ పేయి పునాది వేశారు. అలా 1998లో ఒక ఎంపీ సీటు, 1999లో రెండు ఎంపీ సీట్లు, 2009లో 1 సీటు బీజేపీ సాధించింది. మోడీ ప్రధాని అభ్యర్థిగా దిగిన 2014 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి. 2019లో అయితే ఏకంగా 18 ఎంపీ సీట్లు 40.64 శాతం ఓటు షేర్ సాధించి తొలిసారిగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి సవాల్ చేసింది. 2024 లో అయితే 12 ఎంపీ సీట్లూ, 38.73 శాతం ఓటు షేర్ సాధించినా గట్టిగా రెండేళ్ళు తిరిగేసరికి తన ఓటు షేర్ ని ఏకంగా 45 శాతానికి పైగా పెంచుకుని 206 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని దక్కించుకుంది.
ఆయనకు మొక్కిన మోడీ :
బీజేపీ దేశమంతా గెలిచినా బెంగాల్ గడ్డ మీద విజయం మాత్రం ఎంతో అనిర్వచనీయమైనది. ఎందుకంటే బీజేపీ పూర్వ రూపం జన సంఘ్ పుట్టిన నేల అది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయం కాషాయం పార్టీ అధికారంలోకి రావడం. అంతే కాదు బీజేపీ తొలి ఊపిరి తీసిన పురిటి గడ్డ. అందుకే నరేంద్ర మోడీ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి నాటి జన సంఘ్ నుంచి నేటి బీజేపీ వరకూ పార్టీలో కొనసాగుతున్న 98 ఏళ్ళ వృద్ధ కాషాయ నేత కాళ్ళకు ఆయన వేదిక మీద అందరి సమక్షంలో మొక్కారు. ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరు మఖన్ లాల్ సర్కార్. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి అత్యంత సన్నిహితుడు. జన సంఘ్ తొలి జెండాను ఎత్తిన కార్యకర్త. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ కి నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిన 370 పేరుతో ప్రత్యేక ప్రతిపత్తి తొలగించాలని కోరుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ యాత్ర చేపడితే ఆయన వెంటనే మఖన్ లాల్ సర్కార్ కూడా ఉన్నారు. ఈ రోజున శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకపోయినా ఆయన సన్నిహితుడు మఖన్ లాల్ కళ్ళలో ఆనదం చూసే నరేంద్ర మోడీ ఆయనకు మొక్కారు. పశ్చిమ బెంగాల్ నేల మీద బీజేపీ అధికారం అందుకోవడానికి ముప్పావు దశాబ్దం పైగా పట్టింది. అయితే అది నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం అయింది అని బీజేపీ క్యాడర్ మొత్తం గర్వరంగా చెబుతున్నారు.