కొనొద్దు...తిరగొద్దు - మోడీ చెబితే వినాలి

కనీసం ఏడాది పాటు అయినా బంగారం కొనుగోళ్ళకు ప్రజలు దూరంగా ఉండాలని మోడీ సూచించారు. అంతే కాదు ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని అన్నారు.;

Update: 2026-05-11 04:16 GMT

బంగారంతో భారతీయులకు ఉన్న బంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రతీ శుభ కార్యాలకూ బంగారం కొనడం భారతీయులు తప్పనిసరిగా చేస్తారు. బంగారం సెంటిమెంట్. లక్ష్మీ దేవిగా చూస్తారు. బంగారం ఇంట్లో ఉంటే సంపదగా భావిస్తారు. అలాంటిది బంగారం కొనవద్దు అని చెబితే వింటారా కానీ చెప్పినది దేశ ప్రధాని నరేంద్ర మోడీ. గతంలో ఆయన చెప్పిన పనులు ఎన్నో ఈ దేశ ప్రజలు చేశారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో మోడీ ఏమి చేయమంటే అది చేశారు. ఈ రోజుకీ మోడీ మాటే మంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే మోడీ తెలంగాణా గడ్డ మీద హైదరాబాద్ నడి బొడ్డు నుంచి దేశ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. బంగారం కొనవద్దు అని.

విదేశీ మారక ద్రవ్యం కోసం :

కనీసం ఏడాది పాటు అయినా బంగారం కొనుగోళ్ళకు ప్రజలు దూరంగా ఉండాలని మోడీ సూచించారు. అంతే కాదు ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని అన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వంట నూనెల విషయంలోనూ వినియోగాన్ని చాలా వరకూ తగ్గించుకోవాలని అన్నారు అలాగే విదేశాల నుంచి భారీగా రసాయన ఎరువులను దిగుమతి చేసుకుంటున్నామని మోడీ గుర్తు చేస్తూ రసాయన ఎరువుల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతుందన్నది గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అందువల్ల రసాయన ఎరువులను తగ్గించుకుంటే కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున మిగిలించుకోగలమని చెప్పారు. ఇక వ్యవసాయంలో కొత్త మార్పులకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. వ్యవసాయంలో వాడే డీజిల్‌కు బదులు సౌర పంపులను ప్రోత్సహిస్తున్నామని మోడీ అన్నారు. అలాగే వ్యవసాయంలో స్వదేశీ వస్తువులను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు తాను స్వదేశీ వస్తువుల గురించి మాట్లాడితే దీపావళి దీపాలు గురుంచి ఎక్కువగా మాట్లాడుతున్నారని మోడీ అన్నారు. అయితే దీపాలు కొంటే స్వదేశీని ప్రోత్సహించినట్లు కాదని ఆ విధంగా భ్రమలలో ఎవరూ ఉండరాదని ఆయన అన్నారు

కాంగ్రెస్ కి కొత్త పేరు :

హైదరాబాద్ సభలో కాంగ్రెస్ కి మోడీ కొత్త పేరు పెట్టారు. దేశంలో కాంగ్రెస్ ద్వేష పూరితమైన రాజకీయాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది అని మోడీ విమర్శించారు. అందుకే కాంగ్రెస్ ఎంఎంసీగా మారిందని ఎద్దేవా చేస్తూ కొత్త పేరు పెట్టారు ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్‌ మావోవాది కాంగ్రెస్‌ అని మోడీ అర్ధం కూడా చెప్పారు. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని మోడీ గుర్తు చేశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి పెద్ద తప్పు చేశామ్ని ప్రజలు ఆవేదన చెందుతున్నారని మోడీ చెప్పడం విశేషం.

పెట్రో డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి :

గల్ఫ్ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఇంధనం సంక్షోభం వచ్చిందని మోడీ చెప్పారు. అయినప్పటికీ దేశంలో మాత్రం ఎక్కడా ఇంధనం ధరలు పెంచలేదని ఆయన చెప్పారు దేశ ప్రజలు ఈ కీలక సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని బాగా తగ్గించాలని నరేంద్ర మోడీ కోరారు. దానికి బదులుగా మెట్రో సేవలను వాడుకోవాలని, విద్యుత్ వాహనాలను ఉపయోగించుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు.

Tags:    

Similar News