కార్యకర్త హ్యాపీగా ఉండాలి...భారం మీదే !
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే.;
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే. ఆ విషయంలో రాజీ పడేది లేదని ఆయన దిశా నిర్దేశం చేశారు వారిని హ్యాపీగా ఉంచాల్సిందే రెండవ మాట లేనే లేదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీకి కార్యకర్త అధినేత అన్నది మరచిపోకూడదని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయఒ ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పక్కాగా జరగాల్సిందే :
టీడీపీకి ఒక విధానం ఉందని అది అధినాయకత్వం నిర్ణయిస్తుందని దానిని కచ్చితంగా పార్టీ అంతా పాటించాల్సిందే అని కూడా నారా లోకేష్ చెప్పారు. పార్టీకి కార్యకర్తే అధినేత అనే టీడీపీ విధానం పక్కాగా అమలు కావాలని ఆయన కోరారు. ఆ దిశగా ప్రతీ కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నామనే నిర్లక్ష్యం పనికి రాదని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేశారో దాని కంటే కూడా ఎక్కువ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని లోకేష్ కోరారు.
కోఆర్డినేషన్ తప్పనిసరి :
తెలుగుదేశం పార్టీలో ప్రతీ స్థాయిలో కో ఆర్డినేషన్ అతి ముఖ్యమని నారా లోకేష్ అన్నారు. ఇంచార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇంఛార్జ్ ల సమన్వయం ఎంతో కీలకం అని కూడా ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కో ఆర్డినేటర్లు ఎప్పటికపుడు సమీక్షించాలని సూచించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదేనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ప్రజా వేదికల పేరిట కార్యక్రమాలు ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని లోకేష్ సూచించారు.
నామినేటెడ్ పందేరం :
ఇక టీడీపీలో అంతా ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల విషయంలో కూడా లోకేష్ ఒక కీలక విషయం వెల్లడించారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు అన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారు అర్హులకు ఈ పదవులు దక్కుతాయని ఆయన వెల్లడించారు. పనిచేసే కార్యకర్తలకు ఈ పదవులు దక్కాలని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే ఎప్పటికపుడు పార్టీ పరిస్థితి మీద పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని లోకేష్ పార్టీ నేతలకు ఒక క్లారిటీతో కూడిన సందేశం ఇచ్చేశారు.