మీ వల్లే కూటమి గెలుపు... ఎన్ఆర్ఐలపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.;

Update: 2025-12-07 08:18 GMT

మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన మొదలైంది. శనివారం ఉదయం ఆయన డల్లాస్ చేరుకున్నారు. తెలుగు ప్రవాసులు, టీడీపీ శ్రేణులు, కూటమి అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డల్లాస్ లోని గార్లాండ్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో తెలుగు వాళ్లు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారని ప్రవాసులకు ధన్యావాదాలు తెలిపారు. ఇక ఎన్ఆర్ఐలను ఎంఆర్ఐలుగా లోకేశ్ అభివర్ణించారు. ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (అత్యంత నమ్మదగ్గ వ్యక్తులు) అనే అర్థంలో లోకేశ్ మాట్లాడటం ఆకట్టుకుంది.

రాష్ట్రంలో ఎన్‌డిఎ (NDA) చారిత్రక విజయంలో ప్రవాసుల పాత్ర ఎక్కువని లోకేశ్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వాళ్లు (వైసీపీ) 175/175 నినాదం ఇస్తే, మీరు వారి వైనాట్ 11తో సరిపెట్టుకునేలా చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికి వేగంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రవాసులకు ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

విడాకులు, మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ తేల్చిచెప్పారు. మేం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదు. చంద్రబాబును 53 రోజులు పాటు అక్రమంగా జైలులో ఉంచినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసు. అందుకే సిద్ధం సిద్ధం అని బయటు దేరిన పార్టీని ప్రజలు భూ స్థాపితం చేశారని లోకేశ్ అన్నారు.

ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయింది. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరగరాస్తాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారులు ఉంటే, ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయం’’ అని లోకేశ్ అన్నారు.

Tags:    

Similar News