ఆటో వాలాలకు ఉన్న అవగాహన వారికి లేదు: వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు
అప్పుడే వారు .. తనకు చెప్పారని, రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన త్వరలోనే దిగిపోతుందని ధీమా వారి మాటల్లోనే వినిపించిందన్నారు.;
విజయవాడలో జరిగిన `ఆటో డ్రైవర్ల సేవలో` పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు బయట ప్రయాణిస్తున్నా.. తనకు ఎదురుపడే ఆటోల వెనుక.. రాసి ఉండే కొటేషన్లను పొల్లు పోకుండా చదువుతానని చెప్పారు. ఈ కొటేషన్లు.. ఆటో డ్రైవర్ల మనసుకు అద్దం పడతాయన్నారు. ఒకప్పుడు పెద్దగా చదువుకోని వారు ఆటో ఫీల్డ్‌కు వచ్చేవారని.. కానీ, ఇప్పుడు అనేక మంది చదువుతో సంబంధం లేకుండా.. ఈ రంగంలోకి వస్తున్నారని తెలిపారు.
ఆటో డ్రైవర్లను ఎవరూ కించపరచడానికి వీల్లేదని మంత్రి చెప్పారు. ఎవరైనా కించపరిస్తే.. నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. అంతేకాదు.. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఆటోడ్రైవర్లకు ఎంతో అవగాహన ఉంటుందని చెప్పారు. ఏ ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసినా.. ప్రభుత్వాల పనితీరుపైనే చర్చించుకుంటారని అన్నారు. వారికి ఉన్న అవగాహన చాలా మందికి ఉండడం లేదని.. పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. గతంలో తాను యువగళం పాదయాత్ర జరిపినప్పుడు.. చాలా మంది ఆటో డ్రైవర్లతో మాట్టాడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
అప్పుడే వారు .. తనకు చెప్పారని, రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన త్వరలోనే దిగిపోతుందని ధీమా వారి మాటల్లోనే వినిపించిందన్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆటో డ్రైవర్లు సంతోషంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇక, తాను ధరించిన ఖాకీ చొక్కాను చూపిస్తూ.. ఖాకీ చొక్కాకు టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. గతంలో నందమూరి తారక రామారావు.. పార్టీ పెట్టినప్పుడు.. చైతన్య రథం ద్వారా ప్రజలను కలుసుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ఆయన కూడా ఖాకీ చొక్కానే ధరించారని చెప్పారు.
అదేవిధంగా చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో కాఖీ చొక్కాను వేసుకున్నారని.. తమ పార్టీ పేదల పక్షపాతి అని చెప్పేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ఉందని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణగా మంత్రి నారా లోకష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించామన్న ఆయన.. రహదారుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని వివరించారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని త్వరలోనే అన్నీ చేస్తామన్నారు.