కొడుకు దేవాన్ష్ పనులతో లోకేశ్ ఫిదా.. మంత్రి షేర్ చేసిన క్రేజీ వీడియో వైరల్
నారా కుటుంబ వారసుడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు.
నారా కుటుంబ వారసుడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వినూత్నమైన డిజిటల్ కాన్సెప్ట్‌తో వారం వారం పాడ్ కాస్ట్ వీడియోలు చేసేందుకు దేవాన్ష్ సిద్ధమయ్యారు. త్వరలోనే నారా దేవాన్ష్ హోస్ట్‌గా సరికొత్త పాడ్‌కాస్ట్ ప్రారంభించబోతున్నారని, దీనికి సంబంధించిన టీజర్ ద్వారా మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ టీజర్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ కనిపించి వీక్షకులకు వీనుల విందుగా మారారు. దేవాన్ష్ లోని అసాధారణ టాలెంట్‌ను స్వయంగా చూసి న మంత్రి నారా లోకేశ్ ఆశ్చర్యపోతూ, సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు.
దేవాన్ష్ సరికొత్త ప్రయత్నం
సాధారణంగా దేవాన్ష్ వయసు పిల్లలు ఆటపాటల్లోనో, కార్టూన్స్ చూడటంలోనో బిజీగా ఉంటారు. కానీ దేవాన్ష్ మాత్రం కోట్లాది సంవత్సరాల క్రితం అంతరించిపోయిన 'డైనోసార్స్' ప్రపంచంపై మనసు పారేసుకున్నాడు. వాటి గురించిన రహస్యాలు, ఆసక్తికర విశేషాలను ప్రపంచానికి చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం డైనో డీట్స్ పేరుతో ఒక ప్రత్యేకమైన పాడ్‌కాస్ట్‌ను ప్లాన్ చేశాడు. ఇకపై ప్రతి శుక్రవారం ఈ పాడ్‌కాస్ట్ ద్వారా డైనోసార్ల గురించిన ఆసక్తికర విషయాలను దేవాన్ష్ పంచుకోనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆకర్షణీయమైన ఇంట్రడక్షన్ వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
అదొక 'డైనోసార్ రీసెర్చ్ ల్యాబ్'
దేవాన్ష్‌కు డైనోసార్లపై ఉన్న ఇష్టం ఊరికే రాలేదు. దానికోసం ఈ చిన్నారి పక్కాగా హోం వర్క్ చేస్తున్నాడు. డైనోసార్ల గురించి లోతుగా రీసెర్చ్ చేయడం కోసం దేవాన్ష్ తన గదిని పూర్తిగా మార్చేశాడని లోకేశ్ షేర్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోలో తెలుస్తోంది. తన గదిని జురాసిక్ పార్క్‌ను తలపించేలా దేవాన్ష్ డెకరేట్ చేసుకున్నాడు. కొడుకు రూమ్‌ను చూసి ఆశ్చర్యపోయిన నారా లోకేశ్, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ చిన్నారి డైనోసార్ల గురించి చెప్తుంటే ముగ్ధుడైన లోకేశ్, ఆ టాలెంట్‌ను అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పాడ్‌కాస్ట్‌ను నెటిజన్ల ముందుకు తీసుకువచ్చారు.
‘దేవాన్ష్ రూమ్‌లోకి వెళ్లి చూస్తే ఆశ్చర్యపోయాను. డైనోసార్ బుక్స్, బొమ్మలు, పెయింటింగ్స్‌తో ఆ రూమ్ నింపేశాడు. దానిపై తను చేస్తున్న రీసెర్చ్, నాలెడ్జ్ నన్ను ఆకట్టుకున్నాయి. ప్రతి శుక్రవారం పాడ్‌కాస్ట్ ద్వారా దేవాన్ష్ మీ ముందుకు వస్తున్నాడు.’ అంటూ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ టెక్నాలజీ, విజన్, ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయన మనవడు కూడా అదే బాటలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కిడ్స్ నెట్‌వర్క్‌ను ఆకర్షించేందుకు సరికొత్త సబ్జెక్ట్‌తో రావడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.