నాటి అసెంబ్లీ ఘటన : నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు!
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన సతీమణి భువనేశ్వరి గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు.
కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 నవంబరులో అసెంబ్లీలో తనను అవమానించేలా మాట్లాడిన వైనాన్ని మరోమారు గుర్తు చేశారు. ఈ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన భువనేశ్వరి పురాణాల్లో ద్రౌపదికి అవమానించినట్లే తనను వైసీపీ ప్రభుత్వంలో అవమానించారని విరుచుకుపడ్డారు. ఎక్కడా విపక్షం పేరు ప్రస్తావించకపోయినా, నేరుగా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన సతీమణి భువనేశ్వరి గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ముందుస్తుగా ప్లాన్ చేసుకున్న పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. బుధవారం ఓ ఆలయాన్ని సందర్శించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో గతంలో అసెంబ్లీలో తనకు ఎదురైన అవమానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక స్త్రీ గురించి మాట్లాడే హక్కు ఏ మాగాడికి లేదని హెచ్చరించారు.
ఆలయాన్ని సందర్శించిన అనంతరం నాటి అసెంబ్లీ ఎపిసోడ్ ను ప్రస్తావనకు తెచ్చారు భువనేశ్వరి ‘‘నేను ఎప్పుడు ఆ విషయంపై మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ, ఈ వాళ ఆ ద్రౌపది అమ్మను చూశాను. ద్రౌపది భర్తను అవమానించాలనే ఉద్దేశంతో నిండు సభలోకి తీసుకువచ్చి ఆ అమ్మ చీర లాగి అవమానించారు. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఎదురుదెబ్బ కొట్టాలని నా పేరు లాగారు, నా గురించి మాట్లాడారు’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం మాట్లాడటం ఎవరికీ అవసరం లేదని, దమ్ముంటే మగాడు మగాడుగానే నిల్చుని మాట్లాలి. ఒక స్త్రీ కోసం మాట్లాడకూడదు అంటూ తేల్చిచెప్పారు. ప్రతి మహిళకు తన కోసం తాను తెలుసుకుంటుందని, ఇతరులు ఎవరూ మాట్లాడటానికి అర్హత లేదని తేల్చి చెప్పారు భువనేశ్వరి.
ఇక నాటి దుశ్వాసన పర్వంలో కృష్ణుడే దిగివచ్చి ద్రౌపదికి అండగా నిలిచాడని, ఇప్పుడు ప్రజలే దేవుడి రూపంలో తమ కుటుంబానికి రక్షణగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతును తాము ఎప్పుడూ మరచిపోమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం సతీమణి భువనేశ్వరి మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతోంది. కుటుంబ వ్యాపారాలను చూస్తున్న భువనేశ్వరి కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉంటుండటం వల్ల, కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి, కార్యకర్తలు, నాయకుల బాగోగులను భువనేశ్వరి స్వయంగా చూస్తున్నారు.
రెండేళ్లుగా ఆమె క్రమం తప్పకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నా ఎప్పుడూ ఎవరిపై రాజకీయ విమర్శలు చేయలేదని అంటున్నారు. కానీ, తాజాగా ఆమె కృష్ణుడి ఆలయాన్ని సందర్శించడం, అక్కడ ద్రౌపది విగ్రహం కూడా ఉండటంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే భారతంలో దుశ్వాసన పర్యంలో ద్రౌపదికి జరిగిన అవమానం, తనకు అసెంబ్లీలో జరిగిన అవమానం ఒకటేనని గుర్తు చేశారని భావిస్తున్నారు. కాగా, భువనేశ్వరి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ గుర్తు చేయడం ద్వారా విపక్షాన్ని కోలుకోకుండా దెబ్బతీయాలనే కసి భువనేశ్వరిలో కనిపించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.