లా స్టూడెంట్లతో అట్లా ఉంటుంది మరి!.. బార్ కౌన్సిల్‌నే షేక్ చేసిన నల్సార్ విద్యార్థులు!
హైదరాబాద్ లోని నల్సార్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో తాజా పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
హైదరాబాద్ లోని నల్సార్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో తాజా పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఏడాది నల్సార్ లో డిగ్రీ చేసిన విద్యార్థులను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బార్ కౌన్సిల్ లో చేర్చుకోవద్దంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదేశాలు జారీ చేయడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే ఈ ఆదేశాలు విడుదలైన కొద్దిసేపటిలోనే విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీఐ ఈ ఆదేశాలు జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సీజేఐ సూర్యకాంత్ ను విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పిలవొద్దంటూ నల్సార్ వర్సిటీకి చెందిన 450 మంది విద్యార్థులు లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చర్య ద్వారా విద్యార్థులు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని అవమానించారని భావిస్తూ బీసీఐ చర్యలకు దిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేయడమేనన్న విమర్శలతో వెనక్కి బీసీఐ వెంటనే తగ్గిందని చెబుతున్నారు.
నల్సార్ విద్యార్థులను బార్ కౌన్సిల్ లో చేర్చుకోవద్దని బీసీఐ ఆదేశాలు, ఆ వెంటనే ఆదేశాలు వెనక్కి తీసుకుంటున్నట్లు జారీ అయిన ప్రకటనపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ చర్య ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు విద్యార్థి లోకంలోనూ హాట్ డిబేట్ గా మారింది. జూన్ 20న నీట్ అక్రమాలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిందని, విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని సుప్రీం దృష్టికి తీసుకువచ్చేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, వారి వీడియోలు చూసే టైము లేదని సీజేఐ సూర్యకాంత్ అన్నట్లు వార్తలు వచ్చాయని చెబుతున్నారు. సీజేఐ వ్యాఖ్యలు తాము వర్సిటీలో నేర్చుకున్న విలువలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తూ ఈ ఏడాది స్నాతకోత్సవంలో ఆయన చేతుల మీదుగా పట్టాలు తీసుకోమని స్పష్టం చేస్తూ విద్యార్థులు రాసిన లేఖతో పెద్ద దుమారం చెలరేగింది.
దీనికి కొనసాగింపుగా లేఖ రాసిన 450 మంది విద్యార్థులను న్యాయవాదులుగా గుర్తించొద్దు అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేయడం మరింత రచ్చకు దారితీసింది. బీసీఐ చర్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో కొద్దిసేపటిలోనే ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. అయితే విద్యార్థులు అమాయకులని, వారిని కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని భావిస్తున్నట్లు బీసీఐ స్పష్టం చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని వర్సిటీ వీసీని కోరినట్లు ప్రకటించింది. వైస్ చాన్సలర్ నివేదిక అందిన తర్వాత ఈ వ్యవహారంపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ పరిణామంతో నల్సార్ వర్సిటీ లా విద్యార్థులు, బీసీఐ మధ్య వివాదం ముదురుతుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నల్సార్ విద్యార్థులు ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని బీసీఐ కూడా తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్సిటీ వీసీ ఇచ్చే నివేదిక కీలకంగా మారనుందని వ్యాఖ్యానిస్తున్నారు.