E20 పెట్రోల్ పై మూడు బడా కంపెనీలు విముఖత..!? రాయిటర్స్ సంచలన కథనం

E20 పెట్రోల్ లో రసాయన మిశ్రమాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం, పెట్రోల్‌లో క్లోరైడ్ పరిమితి 3 పీపీఎమ్ లోపు మాత్రమే ఉండాలి.

Update: 2026-08-14 09:38 GMT

దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'E20 పెట్రోల్’పై మూడు ప్రధాన కార్ల ఉత్పత్తి సంస్థలు విముఖంగా ఉన్నాయని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల కారు ఇంజిన్లు పాడయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్' (SIAM)కు గతంలోనే లేఖ రాశాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాయిటర్స్ కథనం మరింత వేడి పుట్టిస్తోందని చెబుతున్నారు.

స్వదేశీ ఇంధన వనరుల ప్రోత్సాహమే లక్ష్యంగా ప్రభుత్వం E20 పెట్రోల్ ను ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నప్పటికీ ఇంజిన్లు పాడైపోతాయని వాహనదారులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో దేశంలో ఆటోమొబైల్ రంగంలో 67 శాతం వాటా ఉన్న మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు సైతం E20 పెట్రోల్ వల్ల కార్లు పాడయ్యే ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశాయని చెబుతున్నారు. ఈ సంస్థలు బహిరంగంగా E20 వినియోగానికి మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అంతర్గత విశ్లేషణల్లో మాత్రం ఇంధన నాణ్యత పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని రాయిటర్స్ తన కథనంలో రాసిందని చెబుతున్నారు.

E20 పెట్రోల్ లో రసాయన మిశ్రమాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం, పెట్రోల్‌లో క్లోరైడ్ పరిమితి 3 పీపీఎమ్ లోపు మాత్రమే ఉండాలి. కానీ, దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో సేకరించిన 250కి పైగా ఇంధన నమూనాలను పరీక్షించగా, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఈ స్థాయి 1.4 నుండి ఏకంగా 570 పీపీఎమ్ వరకు ఉన్నట్లు తేలింది. ఇంతటి అధిక స్థాయి క్లోరైడ్ కలుషితాలు వాహనాల ఫ్యూయల్ ఇంజెక్టర్లను వేగంగా తుప్పు పట్టేలా చేయడమే కాకుండా, ఇంజన్ పనితీరును అస్తవ్యస్తం చేస్తాయని తయారీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

క్లోరైడ్‌తో పాటు, ఇథనాల్ మిశ్రమంలోని అధిక తేమ శాతం వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంధనంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, వాహనాలు నడుస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ఇంజన్ భాగాలను దెబ్బతీయడమే కాకుండా, హైవేలు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వినియోగదారుల భద్రతకు కూడా ముప్పుగా పరిణమించనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. మైలేజీ తగ్గిపోవడం, ఇంజన్ల నుంచి వింత శబ్దాలు రావడం వంటి ఫిర్యాదులు ఇప్పటికే వాహనదారుల నుండి వెల్లువెత్తుతున్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వం మాత్రం E20 ఇంధనం వల్ల ఎలాంటి నష్టం లేదని పదే పదే ప్రకటిస్తోంది. కానీ, కార్ల తయారీ సంస్థల అంతర్గత పరీక్షలు, వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్న మాటలకు భిన్నంగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఇంధన సప్లై చైన్ లో ఉన్న నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో లోపాలు ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. కేవలం ఇథనాల్‌ను కలపడమే కాకుండా, అందుబాటులోకి వచ్చే ఇంధనం నాణ్యతపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News