అమరావతి అన్ స్టాపబుల్...కదపలేరు !
అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.;
అమరావతి రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఆయన రాజధాని విషయంలో సాగుతున్న రచ్చ మీద తనదైన శైలిలో పదునైన విమర్శలే సంధించారు. అమరావతి గురించి ఏమనుకున్నా కూడా అన్ స్టాపబుల్ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అమరావతిని ఎవరూ అసలు కదపలేరని ఆయన ధీమాగా చెప్పారు.
అదే దురదృష్టకరం :
నాగరికతల గురించి తెలియని వాళ్లు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని బాబు వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో వారే అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఎవరెన్ని చేసినా కూడా రాజధానిగా అమరావతిని ఎవరూ కదపలేరని ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఎక్కడైనా నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని ఆయన చెప్పుకొచ్చారు. అది కూడా తెలియని వారు రాజకీయాల్లో ఉండటం బాధాకరమని బాబు అన్నారు.
అద్భుతమైన నగరంగా :
ఫ్యూచర్ అంతా అక్కడే ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను అమరావతి రాజధానికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చామని ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకునేలా చేస్తామని అన్నారు.
హద్దు లేని అసూయ :
విపక్ష నేత జగన్ మీద చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలే పరోక్షంగా చేశారు. కొందరి అసూయకు హద్దు లేకుండా పోతోందని ఆయన అన్నారు. గత పాలనలో అమరావతిని ఆపేయాలని కుట్రలు చేస్తే ఏమయ్యారో చూశామని ఆయన అన్నారు. వారికి అయినా బుద్ధి రాలేదని బాబు మండిపడ్డారు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. అయితే ఢిల్లీ, చెన్నై, విశాఖ, నెల్లూరు, రాజమండ్రి ఎక్కడున్నాయో వారికి తెలియదా అని ప్రశ్నించారు. ఎక్కడ నీరు ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుందని చరిత్ర చెబుతోంది అని బాబు అన్నారు. ఇక అమరావతి ప్రజా రాజధానిగా ఉందని, అందువల్ల దీనిని ఎవరూ ఆపలేరని బాబు స్పష్టం చేశారు. పవిత్ర జలాలు, మట్టితో అక్కడి ప్రాంతాన్ని పునీతం చేశామని బాబు చెప్పారు
అంతా కలసి గ్రేటర్ గా :
ఇక అమరావతి అభివృద్ధి వేగంగా విస్తరిస్తుందని అందువల్ల భవిష్యత్ లో విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిసి ఉత్తమ నివాస ప్రాంతంగా తయారవుతుందని ఆయన చెప్పారు. మరో ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వస్తుందని బాబు చెప్పారు. అలాగే రాబోయే రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారుచేసి ప్రపంచానికి సరఫరా చేయబోతున్నామని కొత్త విషయం చెప్పారు. ఇక క్వాంటం అల్గారిథమ్స్ నేర్పేందుకు విద్యార్థులకు నిపుణులకు శిక్షణ అందిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించడం విశేషం.