ఎన్నికల్లో పోటీపై నాగబాబు సంచలన నిర్ణయం

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2031 మార్చి 30 దాకా ఉంటుంది.;

Update: 2025-12-14 06:16 GMT

మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 2031 మార్చి 30 దాకా ఉంటుంది. అంటే శాసనమండలిలో నాగబాబు 2029 తరువాత కూడా కొనసాగుతారు అన్న మాట. ఇక 2029 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. అలా ఎందుకు అంటే నాగబాబు ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఒక సీటు చూసుకుని పోటీకి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగడమే దానికి కారణం.

అనుకుంటే ఓకే :

నిజానికి నాగబాబు జనసేన పార్టీ నిర్మాణంలో కానీ పటిష్టం చేయడంలో కానీ ఎంతో కృషి చేశారు. ఆయన తెర వెనక నుంచి చేసిన సేవ చాలా ఎక్కువ అని చెబుతారు. మెగా అభిమానులకు ఒక త్రాటి మీదకు తీసుకుని రావడం కానీ ఎప్పటికపుడు క్యాడర్ తో సమావేశాలు పెడుతూ వారికి చేరువలో పార్టీ ఉండేలా చేయడంలో కానీ నాగబాబు పోషించిన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అలాంటి నాగబాబు కనుక అనుకుంటే పోటీకి ఇబ్బంది ఉండదు, నిజానికి ఆయన 2019లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి రెండు ప్రధాన పార్టీల మధ్య నిలిచి కూడా లక్షలలో ఓట్లు కొల్లగొట్టారు అన్నది అంతా గుర్తు చేసుకోవాలి.

శ్రీకాకుళం నుంచి :

ఇక ఈ మధ్యనే నాగబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఎచ్చెర్ల శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆయన క్యాడర్ తో కలసి తిరిగారు. దాంతో ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది. నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో ఏదో ఒక దానిని ఎంచుకుని పోటీ చేస్తారు అని. కూటమిలో కూడా ఇది ఒక చర్చకు దారి తీసింది అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కింజరాపు కుటుంబం శాసిస్తోంది. ఈ నేపధ్యంలో అక్కడకు వెళ్ళి నాగబాబు పోటీ అంటే కూటమిలో ఇబ్బందులు వస్తాయని ప్రచారం కూడా చేశారు. అయితే నాగబాబు ఈ విషయంలో ఏమీ మాట్లాడింది కూడా లేదు.

నో అంటున్న నాగబాబు :

ఇక తాజాగా నాగబాబు మరోసారి ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించారు. ఆయన విశాఖలో పార్టీ క్యాడర్ ని ఉద్దేశించి ఏ ఎన్నిక అయినా పోటీకి క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో నాగబాబు ఎన్నికల్లో పోటీ చేసే విషయం చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన తన సన్నిహితులు అయిన వారితో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పారని అంటున్నారు. నిజానికి నాగబాబుని ఉత్తరాంధ్ర జిల్లాలలో పోటీ చేయమని జనసేన అభిమానులు కోరుతున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. కానీ నాగబాబు మాత్రం తాను పోటీకి దూరం అని అంటున్నారు.

పార్టీ సేవకే ఇక :

రానున్న కాలం అంతా తాను పార్టీ సేవకే అంకితం అవుతాను అని నాగబాబు చెబుతున్నట్లుగా అంటున్నారు. నాగబాబు వచ్చే ఎన్నికల నాటికి ఏడు పదుల వయసు కి వస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని కూడా అంటున్నారు ఇంకో వైపు అందరూ పోటీలో ఉంటే పార్టీకి పనిచేసే వారు కూడా ఉండాలి కదా అన్నది ఉంది. మెగా అభిమానులతో పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తో నిరంతరం అందుబాటులో ఉండే నాగబాబు పార్టీకే ఎపుడూ ఓటేస్తారు అని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఉంది. దాంతో 2029 నాటికి జనసేన అభ్యర్ధులు అంతటా విజయం సాధించేలా ఆయన అన్ని జిల్లాలలో తిరిగి పార్టీని బలోపేతం చేసే పనిలో ఉంటారని చెబుతున్నారు.

చాన్స్ అలా ఉందా :

ఇక నాగబాబు ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నా పార్టీ కనుక కోరితే పోటీకి సైతం రెడీ అని అంటున్నారు. ఆయనకు నిజానికి 2024 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేయాలని ఉండేది కానీ పొత్తుల కోసం దానికి వదులుకుని అనకాపల్లి ఎంపీ సీటుకు షిఫ్ట్ అయ్యారు. అయితే చివరి నిముషంలో ఆ సీటుని బీజేపీకి ఇవ్వడంతో నాగబాబు పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి జనసేన ఎక్కువ సీట్లు కోరవచ్చు. దాంతో ఏమైనా అవసరం పడితే నాగబాబు పోటీకి సైతం అప్పటి పరిస్థితుల బట్టి సిద్ధంగా ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News