శిథిలాల కింద సజీవంగా.. మొన్న గర్భిణీ, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్!

వరుసగా 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన భూకంపాలు మయన్మార్ ను, థాయిలాండ్ ను వణికించేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-02 07:30 GMT

వరుసగా 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన భూకంపాలు మయన్మార్ ను, థాయిలాండ్ ను వణికించేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ భూవిలయం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదని అంటున్నారు. శిథిలాల కింద తవ్వే కొద్దీ మృతదేహాలు, క్షతగాత్రులు బయట పడుతున్నారని అంటున్నారు. ఫలితంగా.. మయన్మార్ లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

భూకంపం మిగిల్చిన విషాదం నుంచి మయన్మార్, థాయిలాండ్ దేశాలు ఇంకా తేరుకోలేకపోతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారికి, మృతదేహాలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్స్ అవిరామంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించగా.. అతడు ఇప్పటికీ సజీవంగా ఉండటం గమనార్హం.

అవును... మార్చి 28న భూకంపం సంభవించగా.. నాటి నుంచి ఓ భవనం శిథిలాల కింద 26 ఏళ్ల వ్యక్తి అలానే ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యక్తిని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. ఇక ఇటీవల మాండలేలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఒక గర్భిణీని సజీవంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే.

కాగా... వరుస భూకంపాలతో మయన్మార్ కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బంది పడుతోన్న ఆ దేశాన్ని.. ఇప్పుడు భూవిలయం మరింత కుదిపేసింది. ఈ ప్రకృతి విలయం కారణంగా ఇప్పటివరకూ సుమారు 2,719 మంది మృతి చెందగా.. 4,521 మంది గాయపడ్డారు. మరో 441 మంది ఆచూకీ తెలియరాలేదని అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది.

మరోపక్క పొరుగుదేశానికి అండగా నిలిచేందుకు "ఆపరేషన్ బ్రహ్మ" పేరిట భారత్ పెద్ద ఎత్తున సహాయక సామాగ్రిని మయన్మార్ కు చేరవేస్తోంది. ఇదే సమయంలో.. 80 మందితో కూడిన ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. భారత్ తో పాటు వివిద దేశాలు కూడా మయన్మార్ కు సాయాన్ని అందిస్తామని ప్రకటించాయి.

ఇక.. ఈ భూకంపం కారణంగా మధ్య, వాయువ్య మయన్మార్ లో మొత్తం 10 వేల భవనాలు కూలిపోవడం లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య విషయంలో మయన్మార్ సైనిక ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదా అనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News