వైసీపీలో ముద్రగడ చేరికలో మరో ట్విస్ట్... రీజన్ ఇదే!

ఇందులో భాగంగా ఈ నెల 15 లేదా 16 న తానొక్కడినే వెళ్లి వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Update: 2024-03-13 09:45 GMT

ఏపీలో మారుతున్న రాజకీయ కీలక పరిణామాలలో... వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరిక ఒకటి. ఈసారి ఎన్నికల్లో కాపుల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత కీలకం అంటున్న నేపథ్యంలో వెస్ట్ నుంచి ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరగా.. ఈస్ట్ నుంచి ఈ నెల 14న ముద్రగడ చేరనున్నట్లు ప్రకటించారు! అయితే ఇప్పుడు ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

అవును... వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా ఈ నెల 14న అనుచరులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి వైసీపీలో చేరాలని ముద్రగడ & కో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో మరో నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 లేదా 16 న తానొక్కడినే వెళ్లి వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ మేరకు ప్రజలకు ఆయన లేఖ రాశారు. ఈ లేఖలో ముందుగా ప్రకటించినట్లుగా 14న ఎందుకు వైసీపీలో జాయిన్ అవ్వడం లేదు.. ముందుగా ప్రకటించినట్లుగా భారీ ఎత్తున శ్రేణులతో ఎందుకు వెళ్లడం లేదు.. 15 లేదా 16వ తేదీన తాను మాత్రమే వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో ఎందుకు చేరుతున్నదీ సవివరంగా వివరించారు. ఈ విషయంలో తనను మరోసారి మన్నించాలని కోరారు.

ఆయన రాసిన లేఖలో... "గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలతో క్షమించమని కోరుకుంటున్నానండి" అని మొదలుపెట్టిన ఆయన... 14-03-2024న గౌరవ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలోకి అందరి ఆశీస్సులతో వెల్లాలని నిర్ణయం తీసుకుని లేఖ ద్వారా తెలియపరిచిన విషయాన్ని తెలిపారు. అయితే... ఊహించినదానికంటే భారీ స్థాయిలో స్పందన రావడంతో సెక్యూరీటీ ఇబ్బంది అని చెప్పారని అన్నారు.

Read more!

ఎక్కువమంది వస్తే కూర్చోడానికి కాదు.. కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోదని, వచ్చిన ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి అందరం కలిసి వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అందరినీ నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేక 16 తేదీలలో తాను ఒక్కడినే వెళ్లి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అందరి ఆశీస్సులు తనకు ఇప్పించాలని కోరారు.

Tags:    

Similar News