అందరి మనసులు చూరగొన్న మోనాలిసా.. ఓసారి చోరీ చేశారు తెలుసా?
మోనాలిసా అసలు చిత్రం లౌవ్రే మ్యూజియంలోనే ఉంది. కానీ, దీనికి ప్రతిరూపాలు ప్రపంచం అంతటా ఉన్నాయి.;
శతాబ్దాలుగా అందమైన అమ్మాయిలను మోనాలిసా అని పిలుస్తున్నారు.. ఇలాంటివారిని ఎవరితో పోల్చాలో తెలియక చివరకు ఆ చిత్ర కళాఖండంతో ముడిపెట్టి ఆకాశానికెత్తుతుంటారు సౌందర్య ప్రేమికులు.. అలాంటి మోనాలిసా అసలు జీవించిన మనిషేనా... లేక కేవలం ఊహాచిత్రమా? అన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం. ఇప్పటికీ మోనాలిసా అంటే అదో ఆరాధన.. నవ్వీ నవ్వనట్లు.. చూసీ చూడనట్లు.. కవ్వించీ కవ్వించనట్లు కనిపించే మోనాలిసా ఒక్కసారైనా నేరుగా చూడాలని చాలామంది కోరిక. అలాంటి చిత్ర రాజం కొలువైనది ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని లౌవ్రే మ్యూజియం. తాజాగా ఈ ప్రఖ్యాత చిత్ర ప్రదర్శనశాలలో భారీ చోరీ జరిగింది. ఇది మొదటిసారి కాదు.. వందేళ్ల కిందటే ఓసారి లౌవ్రే మ్యూజియంలో జరిగిన దొంగతనంతో వార్తల్లో నిలిచింది.
అసలు అక్కడే.. నకిలీలు ప్రపంచం అంతా...
మోనాలిసా అసలు చిత్రం లౌవ్రే మ్యూజియంలోనే ఉంది. కానీ, దీనికి ప్రతిరూపాలు ప్రపంచం అంతటా ఉన్నాయి. మోనాలిసాను పోలిన చిత్రాలను గీయించుకుని ఇళ్లలో పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. దీన్నిబట్టే మోసాలిసా పెయింటింగ్ విశిష్టత ఏమిటో తెలుస్తోంది.
అప్పట్లో రెండున్నరేళ్లు గాయబ్..
లౌవ్రే మ్యూజియంలో తాజా చోరీలో మోనాలిసా అసలు చిత్రం భద్రంగా ఉంది. కానీ, 1911 ఆగస్టు 21న జరిగిన చోరీలో మాత్రం రెండున్నరేళ్లు కనిపించకుండా పోయింది. అప్పట్లో ఇదే అతి పెద్ద చిత్రపట దోపిడీగా పేరొందింది. అయితే, ఈ చోరీ మంచికే అన్నట్లుగా మారి.. మోనాలిసా మాస్టర్ పీస్ గా మారిందని చెబుతున్నారు. వాస్తవానికి 1911లో చోరీలో మోనాలిసా మాయం అయిన సంగతిని 28 గంటలు గుర్తించలేదట. ఓ ఫొటోగ్రాఫర్ లౌవ్రే మ్యూజియంలోకి వెళ్లాక గానీ వాస్తవం బయటపడింది. అప్పటికీ ఏదైనా ఫొటో షూట్ కోసం తీసుకెళ్లారని భావించారు. రోజులు గడిచినా తిరిగిరాకపోయేసరికి ఎత్తుకెళ్లారని స్పష్టమైంది.
పికాసోనే అనుమానించేలా..
అందమైన అమ్మాయిలను మోనాలిసా చిత్రపటంతో పోల్చేవారు.. చేయితిరిగిన చిత్రకారుడిని పికాసోగా పొగడుతారు. అంతటి పికాసోనే మోనాలిసా ఫొటోను ఎత్తుకెళ్లినట్లు తొలుత అనుమానాలు వచ్చాయి. దీనికి కారణం.. పికాసో స్నేహితుడు, ఫ్రెంచ్ రచయిత అయిన అపోలినైర్ కల్పించిన అపోహలు. పెయింటిగ్స్ ఎత్తుకెళ్లే వారితో అపోలినైర్ కు పరిచయాలు ఉండడంతో పోలీసులు అతడిని ప్రశ్నించగా పికాసో పేరు చెప్పాడు. ఆ తర్వాత ప్రఖ్యాత పారిశ్రామికవేత్త అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ కూడా దొంగతనం చేయించారనే అనుమానాలు వచ్చాయి. కానీ, ఎత్తుకెళ్లింది లౌవ్రే మ్యూజియంలో పనిచేసే పెరుగ్గియాగా తేలింది. ఇతడు ఇటలీ నుంచి 1908లో పారిస్ వచ్చి మ్యూజియంలో క్లీనింగ్, రీఫ్రేమింగ్ వంటి పనులు చేశాడు. మోనాలిసా ఫొటో ఫ్రేమ్ తయారీలోనూ పనిచేశాడు.
కారణం ఇదే..
మోనాలిసా చిత్రాన్ని గీసింది ఇటలీకి చెందిన లియొనార్డో డావిన్సీ. కాబట్టి ఈ చిత్రరాజం తమదేశంలోనే ఉండాలని పెరుగ్గియా ఎత్తుకెళ్లాడు. పనివాడే కదా? అని ఎవరూ అనుమానించలేదు. అలా తాను పారిస్ లో ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే దాచి.. తమ దేశానికి చెందిన చిత్రాలు కొనే డీలర్ కు ఫోన్ చేశాడు. తనను తాను లియోనార్డో డావెన్సీగా చెప్పుకొని అమ్మకానికి బేరం పెట్టాడు. కానీ, ఈలోగానే పోలీసులు పెరుగ్గియాను అరెస్టు చేశారు. అలా మోనాలిసా పేరు పాపులర్ అయిపోయింది. డావిన్సీ 1503-1506 మధ్య ఈ చిత్రాన్ని గీసినట్లు చెబుతారు. అప్పట్లో చోరీకి గురైనా.. తాజాగా మాత్రం తప్పించుకుంది. కారణం.. బుల్లెట్ ప్రూఫ్ రక్షణలో అత్యంత పటిష్ఠ భద్రత మధ్య ఉండడమే.