బీహార్ రాజకీయాలను మార్చేసిన పీకే మద్దతుదారు హత్య!

శనివారం సాయంత్రం మొకామా నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ సమావేశం జరుగుతుండగా వందలాది మంది ప్రజలు హాజరయ్యారు.;

Update: 2025-11-02 15:54 GMT

బీహార్ రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారం చివ‌రి దశ‌కు చేరుకుంటున్న కీలక సమయంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిశోర్ (పీకే) నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ మద్దతుదారు దారుణంగా హత్యకు గురవడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన బీహార్‌ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

కాల్పుల కలకలం: మొకామాలో దారుణం

శనివారం సాయంత్రం మొకామా నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ సమావేశం జరుగుతుండగా వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలో గుంపుగా వచ్చిన కొందరు దుండగులు పార్టీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చి, ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పీకేకు సలహాదారుగా ఉన్న, జన్ సురాజ్ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి మామగారు అయిన దులార్ చంద్ తూటా తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.

* జేడీయూ అభ్యర్థిపై హత్యా నేరం!

ఈ దారుణ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన నిందితులను అరెస్టు చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ దాడి వెనుక జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ హస్తం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంత్ సింగ్‌ను ఆదివారం తెల్లవారు జామున అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రత్యర్థి అభ్యర్థిని అడ్డుకునేందుకు ఈ దాడి చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

* రాజకీయాల దిశ మార్చిన హత్య

ఈ సంఘటనతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఇప్పటి వరకు "జంగిల్ రాజ్" అంటూ ఆర్జేడీపై విమర్శలు గుప్పిస్తున్న జేడీయూ, బీజేపీ ఇప్పుడు రక్షణాత్మక స్థితిలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీలు ఈ హింసాత్మక ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా తీవ్రంగా ఎండగడుతున్నాయి. ఈ హత్య బీహార్ రాజకీయ చరిత్రలో మరో చీకటి అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది.

ఎన్నికల వాతావరణంలో హింస చోటుచేసుకోవడంతో ఎన్నికల సంఘం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి అదనపు భద్రతా చర్యలను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చార సభల సమయంలో అదనపు పోలీసు బలగాలను నియమించారు.

* ఎన్నికల కౌంట్‌డౌన్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నవంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. అయితే ఈ హత్యా సంఘటనతో ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. "ప్రజాస్వామ్యంలో గన్‌లు కాదు, ఓట్లు మాట్లాడాలి" అనే సందేశం మరోసారి బీహార్ గడ్డపై ప్రతిధ్వనిస్తోంది. ఈ హత్య ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎంతమేర ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News