జనవరి 22న దీపావళి చేసుకోమంటున్న మోడీ!

అయితే వచ్చే ఏడాది జనవరిలో కూడా దీపావళి జరుపుకోమని చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

Update: 2023-12-30 11:54 GMT

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ప్రతీఏటా నవంబర్ మాసంలో ఈ పండగ జరుపుకుంటారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో కూడా దీపావళి జరుపుకోమని చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అందుకు ఒక తేదీని కూడా ఫిక్స్ చేసిన ఆయన.. అందుకు గల కారణాన్ని చెబుతున్నారు.

అవును... జనవరి 22వ తేదీన అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భక్తులందరూ తమ ఇళ్లల్లో దీపాలను వెలిగించాలని ప్రధాని మోడీ కోరారు. శనివారం అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోడీ... జనవరి 22న దేశ ప్రజలంతా తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించాలని కోరారు.

ఇదే సమయంలో అదేరోజు అయోధ్యకు రావాలన్న ఆలోచన ఉంటే విరమించుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. జనవరి 22న ప్రారంభోత్సవం విజయవంతంగా ముగిసిన అనంతరం, జనవరి 23 నుంచి ఎప్పుడైనా రాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు రావచ్చని అన్నారు. ఒకవేళ 22న భారీగా తరలివస్తే ఆ శ్రీరాముడికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.

అదేవిధంగా... అయోధ్య రామమందిర నిర్మాణం వంటి మహత్తర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఏళ్ల తరబడి జరుగుతున్నాయని.. అందువల్ల ఆ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకూడదని ప్రధాని మోడీ కోరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా... ఈ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పిన ఆయన... అయోధ్య నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చాలని ప్రజలను కోరారు!

Read more!

ఇక జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు.. భారతదేశంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... శ్రీరాముడు యావత్ దేశానికి చెందినవాడు కాబట్టి... ఇప్పుడు ఆయన వస్తున్న సమయంలో చిన్నా పెద్దా అనే తేడాలు ఏమీ లేకుండా... ఏ దేవాలయమూ అపరిశుభ్రంగా ఉండకూడదని అన్నారు.

కాగా... అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి "మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం" అని పేరు పెట్టారు. ఈ విమానాశ్రయంతో పాటు, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన మోడీ... రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు.

Tags:    

Similar News