మోడీ విశాఖ వస్తే చాలు ఆ డిమాండ్ రెడీ !

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తే చాలు ఆ డిమాండ్ ఆయనకు ఎపుడూ రెడీగా ఉంటుంది.;

Update: 2025-06-20 23:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తే చాలు ఆ డిమాండ్ ఆయనకు ఎపుడూ రెడీగా ఉంటుంది. నరేంద్ర మోడీ ఏ సందర్భంలో విశాఖ పర్యటన పెట్టుకున్నా ఆ సుదీర్ఘకాలం నాటి డిమాండ్ మాత్రం పలకరిస్తూనే ఉంటుంది. ఆ డిమాండ్ వయసు నాలుగున్నరేళ్ళు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని స్పష్టమైన ప్రకటన విశాఖ వేదిక మీద నుంచే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ చేయాలని ఉక్కు కర్మాగారం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు 2021 జనవరిలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కేబినెట్ చేసి ఆమోదించిన తీర్మానం ఈ రోజుకీ అలాగే ఉందని అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఉనికికి అది ఎప్పటికైనా ముప్పే అని కార్మిక వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి.

ఆనాటి నుంచి నేటి వరకూ వేలాది రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద టెంట్లు వేసుకుని మరీ కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేస్తూ వచ్చాయి. ఇక ప్రధాని మోడీ ఆనాటి నుంచి అనేక సందర్భాలలో విశాఖ రావడం జరిగింది. ఆయన 2022 నవంబర్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో కలసి విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.

అపుడు కూడా ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయబోమని ప్రధాని ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే మోడీ నుంచి స్టీల్ ప్లాంట్ అన్న మాటే రాలేదని వారు విమర్శించారు. ఆ తరువాత ఎన్నికల వేళ మళ్లీ మోడీ విశాఖ జిల్లా వచ్చారు. ఆయన అనకాపల్లి సభలో ప్రసంగించారు. ఆనాడు కూడా స్టీల్ ప్లాంట్ మీద ప్రకటన చేయాలని కార్మిక సంఘాలు ఉద్యమించాయి. అయినా ఎన్నికల సమయంలో వారి డిమాండ్ల మీద మోడీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇక ఈ ఏడాది జనవరి 8న కూటమి ప్రభుత్వ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేందుకు మోడీ విశాఖ వచ్చారు. నాటి సభలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాలని సంఘాలు కోరినా మోడీ మాట్లాడలేదు అని వారు విమర్శిస్తూ వచ్చారు. ఇపుడు మరోసారి ప్రధాని మోడీ విశాఖ వచ్చారు.

ఆయన విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఇంటర్నేషనల్ యోగా డేలో పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. దాంతో మళ్లీ ఉక్కు కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయడానికే చూస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులను దాదాపుగా అయిదు వేల మందిని తీసేశారని వీఆర్ఎస్ ఇచ్చి మరీ పర్మనెంట్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని ఉక్కులో ఉద్యోగుల కొరత అధికంగా ఉందని వారు అంటున్నారు. అంతే కాదు ప్లాంట్ లాభాల బాటలో పట్టాలీ అంటే ఆర్ధికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ చేత చెప్పించాలని కూడా వారు కోరుతున్నారు. మరి ఈసారి అయినా ప్రధాని విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడుతారా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే యోగా డే గురించే మోడీ ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంతకు మించి ఆయన ప్రసంగంలో వేరే విధానపరమైన ప్రకటనలు ఉండవని అంటున్నారు. దాంతో సుదీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్ మరింత కాలం మోడీ విశాఖ రాక కోసం వేచి ఉండాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News