దుమ్ము రేపుతున్న పీఎం డ్రామా డైలాగ్...
పార్లమెంట్ శీతకాలం సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు వ్యంగ్యంగా తమదైన శైలిలో చురకలు అంటించారు.;
పార్లమెంట్ శీతాకాల సమావేశ నేపథ్యంలో మీడియా ముందు పీఎం ప్రతిపక్షాలనుద్దేశించి చేసిన డ్రామా వ్యాఖ్య ఇపుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇండియా కూటమి భగ్గుమంటోంది. ప్రజాస్వామ్యంలో చర్చించాలనుకోవడం డ్రామా ఎలా అవుతుందని వారు తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. అలాంటి డ్రామాలాడటం మీకే సరి అని అంటున్నారు. సరిగ్గా పార్లమెంట్ సమావేశ నేపథ్యంలో మోదీ ఈ ప్రస్తావన చేయడంలో ఆంతర్యం ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే అని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు..
పార్లమెంట్ శీతకాలం సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు వ్యంగ్యంగా తమదైన శైలిలో చురకలు అంటించారు. ప్రధాని సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం బిహార్ లో ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజాలు...అంతిమంగా ప్రజాసేవకే నాయకులు అంకితం కావాలన్నా కనీస ఆలోచన వారికి కొరవడటం దురదృష్టమని ప్రధాని ఘాటుగా విమర్శించారు. సమావేశాల్లో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు ఉంటాయని, అనవసర డ్రామాలు ఆడుతూ సమయం వృథా చేసుకోరాదని హితవు పలికారు. కావాలంటే వారికి కొన్ని సూచనలు అందజేస్తానని, సమర్థ ప్రతిపక్షంగా వ్యవహరించవచ్చని వ్యంగ్యంగా అన్నారు..
ఎన్నికల నిర్వహణలో అవకతవకలు , సర్, కాలుష్యం లాంటి తీవ్ర అంశాలను చర్చించాలి. ఈ చర్చే లేకుంటే ఇక పార్లమెంట్ సమావేశాలకు అర్థమేముంటుంది? అసలు చర్చలకు అనుమతించకుండా ఏకపక్షంగా వ్యవహరించాలనుకోవడమే అన్నిటికీ మించిన అతిపెద్ద డ్రామాఅని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఘాటుగా స్పందించారు. గత 11 ఏళ్లుగా ఈ ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను ఘోరంగా దెబ్బతీస్తునే ఉందని, కొన్ని సందర్భాల్లో కనీస చర్చల్లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ లో చర్చల్లేకుండా బుల్డోజ్ చేయడం ఎన్డీయేకు అలవాటే అన్నారు. డ్రామాలు చేయొద్దని అందరికన్నా పెద్ద డ్రామా మాస్టర్ చెబుతున్నారు అంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యంగ్యాస్త్రం సంధించారు..
అనుకున్నట్టుగానే ఇవాళ ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు వేడివేడిగా సాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)...ఓటర్ల జాబితా పరిశీలనపై తక్షణ చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేశాయి. తొలి 30 నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఉదయం చేసిన డ్రామా వ్యాఖ్య వల్లనే విపక్షం మండిపడుతోందని దీన్ని బట్టి అర్ధమవుతోంది. సర్ పై ఎలాగూ విపక్షాల డిమాండ్ ఉంటుందని తెలిసిన నేపథ్యంలో మోదీగారు కావాలనే డ్రామా ప్రస్తావన చేశారా అని కొందరి పరిశీలకుల అనుమానం. మొత్తానికి తొలిరోజే పార్లమెంట్ శీతాకాల సమావేశం భగ్గుమంది. ఈ మంట రాజేసింది మాత్రం ప్రధాని డ్రామా అన్న పదమే అని చెప్పక తప్పదు.