మిథున్‌రెడ్డికి అనుమతి వస్తుందా? రాదా?
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4గా ఉన్న ఆ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు రెడీ అయ్యారు.;
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4గా ఉన్న ఆ పార్టీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి న్యూయార్క్ పర్యటనకు రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న డెలిగేషన్ జాబితాలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడి ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో మిథున్ రెడ్డి ఇతర ఎంపీలతో కలిసి పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కోర్టులో అనుమతి కోరుతూ.. పిటిషన్ దాఖలు చేశారు. ''న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది.. అనుమతించండి'' అని ఆయన అభ్యర్థించారు.
గత వైసీపీ హయాంలో తీసుకున్న మద్యం విధానం వల్ల 3500 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు చేశార ని.. ఎన్నికల సమయంలో ఆ సొమ్మును పంపిణీ చేసి ఓట్లు కొన్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పటి మద్యం కుంభకోణంపై కూటమి సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మిథున్‌రెడ్డిని కూడా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 71 రోజులు ఉంచారు. తర్వాత.. ఆయన ఒకసారిమధ్యంతర బెయిల్ లభించింది.
అప్పట్లో(సెప్టెంబరు 9న) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత .. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్న వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. అదేసమయంలో రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న మిథున్‌రెడ్డి పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లాల్సి ఉందని.. తనకు బెయిల్ కావాలని కోరారు. దీనిపై విచారణ జరగనుంది. ఇదిలావుంటే.. మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. సిట్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైనా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి అనుమతి వస్తుందా? రాదా? అనేది చూడాలి.