'పెద్ది' రెడ్లు.. కొన్ని మచ్చలు.. ఇంకొన్ని మరకలు.. !
ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకప్పుడు మంచి పేరుంది.;
ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కడప జిల్లాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకప్పుడు మంచి పేరుంది. రాజకీయంగా ఎలా ఉన్నా.. సేవల పరంగా వారికి మంచి పేరుంది. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన నాయకులు సక్సెస్ కావడానికి ఇది దోహదపడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి , సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయాలకు.. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న సానుకూలతే కీలక పాత్ర పోషిం చింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే.. రాను రాను.. పెద్దిరెడ్డి కుటుంబంపై నలువైపుల నుంచి మచ్చలు, మరకలు పడుతున్నాయి. పడ్డాయి కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. మద్యం కుంభకోణం జరిగింది. దీనిలో పెద్దిరెడ్డి కుమారుడు.. ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర ఉందన్న విషయాన్ని దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి జైల్లో కూడా ఉండి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దీనిలో మిథున్‌కు ఇంకా క్లీన్ చిట్ లభించలేదు. ఇదే సమయంలో మరింత లోతుగా కూడా విచారణ జరుగుతోంది.
ఇదే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై భూముల ఆక్రమణలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అటవీ భూముల వ్యవహారం ఇప్పుడు కాక రేపుతోంది. 104 ఎకరాల అటవీ భూముల ను ఆక్రమించుకున్నారన్నది పెద్దిరెడ్డి కుటుంబంపై వచ్చిన ఆరోపణలు. మరోవైపు మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కేసు కూడా వెంటాడుతోంది. ఇలా.. పెద్దిరెడ్డి కుటుంబానికి మచ్చలు, మరకలు పడ్డాయన్నది తెలిసిందే. వీటికి తోడు నకిలీ మద్యం వ్యవహారం.. కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి చుట్టుకునే అవకాశం ఉందని తెలు స్తోంది.
తంబళ్లపల్లి నియోజకవర్గం కేంద్రంగా జరిగిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో నేరుగా తన పాత్ర లేదని.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చెబుతున్నారు. కానీ.. తన నియోజకవర్గంలో జరిగిన అతి పెద్ద వ్యవహారం.. తెలియకుండా ఉంటుందా? అనేది ప్రశ్న. ఈ కోణంలోనే అధికారులు దర్యాప్తును వేగం చేశారు. ఇది కూడా పెద్ది రెడ్లకు ఇబ్బందులు తెచ్చేవేనన్న వాదన బలంగా వినిపించేలా చేస్తోంది. ఏదేమైనా.. ఇన్నాళ్లు పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న పొలిటికల్ హవా ఈ కేసులతో డౌన్ అవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.